మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్‌ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.
‘‘బీఆర్‌ఎస్‌కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా.
.. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు.
.. అసలు బీఆర్‌ఎస్‌కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్‌లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి.
.. నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment