మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి | Guntur district person In Malaysia Prison | Sakshi
Sakshi News home page

మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి

Published Sun, Jul 28 2019 4:32 AM | Last Updated on Mon, Jul 29 2019 8:19 PM

Guntur district person In Malaysia Prison - Sakshi

భార్య, కుమార్తెతో గురూజీ

గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశం గాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన  వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని రూరల్‌ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. 



రూ.లక్ష అప్పు చేసి..
కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్‌ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు.

గురూజీ సెల్‌ ఫోన్‌కు కుమారుడి దగ్గర నుంచి వచ్చిన లేఖ 

టూరిస్టు వీసా కావడంతో..
సైదారావు గతంలో టూరిస్ట్‌ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో  నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి  పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement