Guntur rural
-
కిరాతక ముఠా అరెస్ట్
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడే అత్యంత కిరాతక ముఠాను అరెస్ట్ చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్, రూరల్ ఏఎస్పీలు ఎన్.వి.ఎస్.మూర్తి (క్రైం), వై.రిశాంత్‌రెడ్డి (అడ్మిన్)తో కలిసి ఆదివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వద్ద అత్యాచార ఘటన, డిసెంబర్ 6, 7 తేదీల్లో యడ్లపాడు పరిధిలోని లింగారావుపాలెం రోడ్డులో, సొలస వెళ్లే రోడ్లో దారి దోపిడీలు జరిగాయి. పాలడుగు ఘటన సంచలనం సృష్టించింది. ఎనిమిది ప్రత్యేక బృందాలతో జల్లెడ పట్టి నిందితులను పట్టుకున్నారు. అరెస్టయింది వీరే.. ఈ నెల 8న కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ మహానందిరోడ్డు యానాది సంగం కాలనీకి చెందిన ఎ.లింగమయ్య, చిందుకూరు వాసి డి.ఓబులేసు, డి.లింగమయ్య, పాణ్యంటౌన్ వాసి సీహెచ్ హనుమంతు, నెమలికుంట గ్రామవాసి డి.వెంకన్నను చంఘీజ్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని కొండవీటి కొండల్లో, 9న ఇ.రమణయ్యను నంద్యాలలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.73 లక్షల బంగారం/వెండి సొత్తు, కర్రలు, కత్తులు, సుత్తులు స్వాధీనం చేసుకోగా, రిమాండ్ నిమిత్తం వారిని చిలకలూరిపేట ఏజేసీజే కోర్టుకు తరలించారు. ఇలా చేసేవారు.. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లింగమయ్యకు డి.జమ్ములు, సుంకన్న, ఓబులేసు బావమరుదులు. డి.జమ్ములు కొడుకు చిన్న లింగమయ్య, వారి బంధువులైన అంకన్న, చిన్న హనుమంతు ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి వేళల్లో మోటారు సైకిళ్లపై, నడిచి వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకొని దోపిడీ చేశాక మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడేవారు. వీరంతా యువకులే. ఇద్దరు పరారీలో ఉన్నారు. నేరాలివే.. ► గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వెళ్లే దారిలో చెట్టు కొమ్మను రోడ్డుపై వేసి, భార్య భర్తను అడ్డగించి పొలంలోకి తీసుకెళ్లారు. భర్తను చితకబాది, భార్యపై అత్యాచారం చేసి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కున్నారు. ► డిసెంబర్ 6న లింగారావుపాలెం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను మరణాయుధాలతో అడ్డగించి గాయపరిచారు. నగలు, నగదు దోపిడీ చేశారు. ► డిసెంబర్ 7న సొలస గ్రామం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను అడ్డగించి వారిని చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అర్బన్ పరిధిలో 18 దారి దోపిడీ కేసులు, రూరల్ పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి. -
అరెస్టయిన 15 రోజుల తర్వాత ఆరోపణలా..!
సాక్షి, గుంటూరు: చట్ట ప్రకారమే యలమంద నాయక్‌ను అరెస్టు చేశామని గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేత వర్ల రామయ్య పోలీసులపై నిరాధార ఆరోపణలు చేశారని.. యలమంద నాయక్ మద్యం కేసులో అరెస్టయ్యారని ఆయన పేర్కొన్నారు. ‘‘ నాయక్‌పై పోలీసులు దౌర్జన్యం చేశారనేది అవాస్తవం. రెవెన్యూ అధికారుల సమక్షంలోనే అరెస్టు చేశాం. నిందితుడిని పోలీసులు వేధిస్తే న్యాయమూర్తికి చెప్పుకునేవారు కదా. ‘50 సీఆర్పీసీ’ కింద కుటుంబ సభ్యులకు ముందుగానే నోటీసులిచ్చాం. రాజకీయ మైలేజీ కోసం మాపై దుష్ప్రచారం చేయొద్దు. (చదవండి: రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదు) ఇలాంటి ఆరోపణలు వల్ల పోలీసులపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లే ప్రమాదముంది. సీఆర్పీసీ యాక్టు ప్రకారమే మేము పని చేస్తున్నాం. పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని’’ ఎస్పీ స్పష్టం చేశారు. అరెస్టయిన 15 రోజుల తర్వాత నిందితుడు ఆరోపించడం సరికాదన్నారు. పని తీరు సరిగ్గా లేకే గురజాల డీఎస్పీ, సీఐ సస్పెన్షన్ చేశామని తెలిపారు. ఫోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో సరైన పురోగతి లేనందునే చర్యలు తీసుకున్నామని, వీరిద్దరి సస్పెన్షన్‌లో వేరే ఎలాంటి కోణం లేదని ఎస్పీ విశాల్ గున్నీ వివరణ ఇచ్చారు. (చదవండి: ‘అందుకే మిమ్మల్ని బూతు కిట్టూ అంటున్నారు’) -
దారుణం : సొంత వదినపై మరుదుల లైంగిక దాడి
గుంటూరు ఈస్ట్: మృగాళ్ల నుంచి రక్షించాల్సిన భర్తే వాళ్లకు సహకరించాలని వంతపాడుతున్నాడని గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ అభాగ్యురాలు సోమవారం గుంటూరు అర్బన్ స్పందనలో కన్నీటి పర్యంతమైంది. కూతురులా చూసుకోవాల్సిన మామ కీచకుడిలా ప్రవర్తిస్తున్నాడని, తల్లిలా గౌరవించాల్సిన మరుదులు లైంగికదాడులకు పాల్పడ్డారని ఆవేదనతో ఫిర్యాదు చేసింది. భర్త, అత్త ఆ కీచకులకు సహకరించాలని, లేదంటే కాపురం నిలవదని తరచూ బెదిరిస్తున్నారని వాపోయింది. ఆ అభాగ్యురాలి ఆవేదన ఆమె మాటల్లోనే... ‘‘పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తితో 2011లో నాకు వివాహం అయింది. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన మామకు కుటుంబ సభ్యుల కోరిక మేరకు రోజూ కాళ్లు పట్టేదాన్ని. ఆ సమయంలో ఆయన అసభ్యంగా ప్రవర్తించేవాడు. అనంతర కాలంలో రెండుసార్లు ఇద్దరు మరుదులు లైంగిక దాడి చేశారు. నాలుగో మరిది మత్తు ట్యాబ్లెట్లు కలిపిన పాలు ఇచ్చి మత్తులో ఉండగా నాపై లైంగికదాడి చేశాడు. నా భర్తకు చెబితే.. ఇష్టం ఉంటే ఉండు.. లేకుంటే వెళ్లిపొమ్మన్నాడు. పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు పెట్టాను. దీంతో నాపై దొంగతనం మోపి అరెస్టు చేయించి రిమాండుకు పంపించారు. విడాకులకు సంతకం పెట్టాలని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ప్రాణరక్షణ కల్పించాలి’’ అంటూ వేడుకుంది. -
మలేషియా జైలులో గుంటూరు జిల్లా వాసి
గుంటూరు: స్నేహితుని మాటలు నమ్మిన ఓ యువకుడు దేశం గాని దేశం వెళ్లి జైలు పాలయిన ఘటన వెలుగు చూసింది. తన కొడుకును రక్షించాలంటూ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని రూరల్ ఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్పందన కేంద్రంలో ఓ పేద కుటుంబానికి చెందిన తండ్రి వేడుకోవడంతో విషయం బహిర్గతమయ్యింది. గుంటూరు జిల్లా, పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డులో నివాసం ఉంటున్న బత్తుల గురూజీ కథనం మేరకు.. గురూజీ ఆటో నడుపుకుంటూ భార్య పద్మ, కుమార్తె చంద్రకళ, కుమారుడు నరసింహారావుతో కలసి జీవిస్తున్నాడు. 10వ తరగతి చదివిన కొడుకు నరసింహారావు ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాడు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువకుడు సైదారావుతో నరసింహారావు స్నేహంగా ఉండేవాడు. అతను గతేడాది చివరిలో మలేషియా వెళ్లి రెండు నెలల పాటు కూలి పనులు చేసి డబ్బుతో తిరిగొచ్చాడు. నరసింహారావును కూడా మలేషియా తీసుకెళ్తానని గురూజీ దంపతులను సైదారావు ఒప్పించాడు. రూ.లక్ష అప్పు చేసి.. కొడుకు జీవితం బాగు పడటంతో పాటుగా కుటుంబానికి ఆసరాగా ఉంటాడని బావించిన తండ్రి లక్ష రూపాయలు అప్పుచేసి ఐదు నెలల క్రితం నరసింహారావును మలేషియా పంపాడు. అక్కడకు వెళ్లిన అనంతరం ఓ కంపెనీలో ప్యాంకింగ్ విభాగంలో పని దొరికిందని నరసింహారావు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆనంద పడ్డారు. అయితే అనంతరం అతని వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది. నాలుగు రోజుల క్రితం ఇంటికి వచ్చిన సైదారావును తమ కొడుకు సమాచారం కోసం విచారిస్తే నరసింహారావు జైలులో ఉన్నాడని, త్వరలోనే వస్తాడని చెప్పాడు. గురూజీ సెల్ ఫోన్‌కు కుమారుడి దగ్గర నుంచి వచ్చిన లేఖ టూరిస్టు వీసా కావడంతో.. సైదారావు గతంలో టూరిస్ట్ వీసాతో మలేషియా వెళ్లొచ్చాడు. అదే తరహాలో నరసింహారావు వెళ్లాడు. పర్యాటకులుగా వెళ్లిన వ్యక్తులు అక్కడ ఎలాంటి ఉద్యోగం చేయకూడదనే నిబంధన ఉంది. దీంతో నరసింహారావు కంపెనీలో పనిచేస్తున్నట్లు గుర్తించిన నిఘా విభాగం వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో కొంతమంది సహాయంతో తనను తీసుకెళ్లాలంటూ వాట్సాప్‌లో మూడు లేఖలను తండ్రికి పంపించాడు. అధికారులు స్పందించి తమ కుమారుడిని కాపాడాలని గురూజీ దంపతులు వేడుకుంటున్నారు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే 8179827921 నంబర్లో సంప్రదించి ఆదుకోవాలని కోరుతున్నారు. -
ఎస్ఐనంటూ యువతికి వల..!
సాక్షి, గుంటూరు: విజిలెన్స్ ఎస్ఐనంటూ యువతిని ప్రేమలోకి దింపి మోసగించిన ఓ హోంగార్డు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తనకు పరిచయం ఉన్న గన్మెన్ల వద్ద ఉన్న తుపాకులు తీసుకుని ఫొటోలకు ఫోజులు ఇచ్చి, వాటిని యువతికి పంపి ప్రేమలోకి దించాడు. తర్వాత ఆమె తల్లి వద్ద రూ.12.50 లక్షలు డబ్బులు తీసుకున్నాడు. పెళ్లి చేసుకోమని అడిగితే తనపైనే నిందలు వేసి నిరాకరించడంతో మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె తల్లి మంగళవారం గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించింది. నరసరావుపేటలో హోంగార్డుగా పనిచేస్తున్న అనిల్ ఫేస్బుక్లో రిక్వెస్టులు పెట్టి పరిచయమై తాను విజిలెన్స్ ఎస్ఐనంటూ తుపాకీ పట్టుకున్న ఫొటోను, ఓ నకిలీ ఐడీని యువతికి పంపాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించాడు. అతను ఎస్ఐ అని నమ్మిన యువతితో పాటు ఆమె తల్లి కూడా పెళ్లికి అంగీకరించారు. బ్యాంకు లోను కింద రూ.15లక్షలు కట్టాల్సి ఉందని, డబ్బు ఇవ్వాలని కోరాడు. వారు బంగారాన్ని తాకట్టు పెట్టి, మరికొంత అప్పు చేసి విడతలుగా రూ.12.50 లక్షలు అనిల్‌కు ఇచ్చారు. కొంతకాలం తరువాత పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో మీ అమ్మాయి మంచిది కాదంటూ ఆరోపణలు చేశాడు. తన స్నేహితుడితో సంబంధం ఉన్నట్లు ప్రచారం చేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. కనీసం తమ డబ్బు అయినా ఇవ్వమని అడిగితే ఇవ్వాల్సింది రూ.6 లక్షలే అంటూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. గట్టిగా మాట్లాడితే తాను చావడమో, మిమ్మల్ని చంపడమో చేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. అనిల్ ప్రవర్తన తో తన బిడ్డ జీవితం నాశనమైందని, పోలీసులు న్యాయం చేయాలని వేడుకుంది. -
బాలికపై లైంగికదాడికి యత్నం
సాక్షి, దాచేపల్లి : మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో బాలికపై లైంగికదాడి యత్నం జరిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. అత్యాచారయత్నంకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు భారీ సంఖ్యలో పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తల్లి చనిపోగా, తండ్రి మరో చోట ఉండటంతో 17 సంవత్సరాల వయస్సున్న మైనార్టీ వర్గానికి చెందిన బాలిక తాతయ్య, నాయనమ్మల వద్ద ఉంటోంది. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గ్రామానికి చెందిన కర్పూరపు వెంకటేశ్వర్లు కుమారుడు నాగేశ్వరరావు బాలిక ఉంటున్న ఇంట్లో కరెంట్ మెయిన్ స్విచ్ ఆపి ఇంట్లోకి ప్రవేశించాడు. ఎంత సేపటికి కరెంట్ రాకపోవటంతో ఇంట్లో ఉన్న వృద్ధులు, బాలిక నిద్ర లేచారు. పక్కింట్లో కరెంట్ ఉండి వీరి ఇంట్లో లేకపోవటంతో బోర్డు వైపు చూడగా, కరెంట్ మెయిన్ ఆపి ఉన్నట్టు గమనించి తిరిగి వేశారు. దీంతో కరెంట్ సరఫరా అయింది. ఇంట్లో గదిలో పడుకున్న బాలికపై అప్పటివరకు మంచం కింద దాక్కున్న నాగేశ్వరరావు లేచి లైంగిక దాడి చేయబోయాడు. బాలిక కేకలు వేయటంతో తాత, నాయనమ్మలు లేచి నాగేశ్వరరావును బలవంతంగా బయటకు పంపించారు. బయటకు ఈ విషయం చెప్పొద్దంటూ నాగేశ్వరరావు బెది రించాడు. బాలిక, తాత, నాయనమ్మ ముస్లిం పెద్దలకు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం ముస్లింలతో పాటు మహిళలు భారీగా తరలివచ్చి బాలికతో ఫిర్యాదు ఇప్పించారు. అత్యాచార యత్నం చేసిన నాగేశ్వరరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముస్లిం నేతలు డిమాండ్ చేశారు. బాలిక ఫిర్యాదుమేరకు నిందితుడు నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రఫీ చెప్పారు. -
ఆగని కన్నీళ్లు...అంతులేని ఆవేదన
కళ్లముందు కదలాడుతున్న తమ బిడ్డల జ్ఞాపకాలు చెదిరిపోతాయేమోనని ఆ తల్లి దండ్రులు రెప్పలైనా వాల్చడంలేదు.. తెరలు తెరలుగా ఉబికివస్తున్న కన్నీటిని పంటిబిగువున బంధించి బిడ్డలు చెప్పిన ఊసులను, వారి అల్లరిని పదేపదే గుర్తుచేసుకుంటున్నారు. కృష్ణమ్మకు కానుకేస్తానంటూ చిల్లర డబ్బులు తీసుకెళ్లి ఆ తల్లి గర్భంలోనే కడతేరారా అయ్యా అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పరామర్శకు వచ్చిన తమ బిడ్డల స్నేహితులను చూసి ‘మాపై పిల్లలు అలిగారమ్మా.. అందుకే తిరిగిరాని లోకాలకు వెళ్లారు’ అంటూ పొగిలిపొగిలి ఏడ్చారు. ఇసుకాసురులు నదీగర్భంలో పాతాళానికి తవ్విన గోతులు తమ బిడ్డలను మింగేశాయన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక.. కడుపుకోతతో ఎలాబతకాలో అర్థంకాక శూన్యంలోకిబేలగా చూస్తున్నారు. తాడేపల్లి రూరల్: నలుగురు విద్యార్థుల మరణంతో చిర్రావూరు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. బిడ్డల్ని పొగొట్టుకున్న తల్లిదండ్రులు గర్భశోకంతో తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా తీరంలో టీడీపీ నేతల అక్రమ ఇసుక తవ్వకాలు ఆ కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. తల్లిదండ్రుల దుఃఖాన్ని అదుపు చేయడం ఎవరి వల్లా కావడం లేదు. కొడుకుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతున్నారు. ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోతున్నారు. గురువారం గుండిమెడ ఇసుక రీచ్‌లో గుంతలో పడి మృతిచెందిన వారిని పరామర్శించేందుకు బంధువులతో పాటు, వడ్లపూడి నాగార్జున హైస్కూల్ విద్యార్థులు, చిర్రావూరు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చిర్రావూరు గ్రామానికి చేరుకున్నారు. తొలుత నీలం క్రాంతికుమార్, శశివర్ధన్ తల్లిదండ్రుల్ని పరామర్శించారు. కొడుకులు ఉన్న ఫొటోను పట్టుకుని చూపిస్తూ కన్నీరుమున్నీరుగా తండ్రి విలపించాడు. ఆకుకూరలు అమ్ముతూ తన కొడుకులను విద్యావంతుల్ని చేయాలనుకున్నానంటూ బావురుమన్నాడు. నాన్నా, అమ్మా ఒక్కరోజైనా మాతోపాటు ఇంటివద్ద ఉండమని బ్రతిమలాడేవారని...అలా లేకుండా ఉన్నందుకు మా మీద కోపగించుకొని శాశ్వతంగా దూరమయ్యారు అంటూ చిన్న కొడుకు అమ్మాయి వేషధారణతో ఉన్న ఫొటో చూపించి దుఃఖించాడు. పిల్లలు సైతం ఆ తల్లితండ్రుల్ని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నారు. తల్లి శేషకుమారి దుఃఖించి స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించారు. అమ్మా.. అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు విద్యార్థులు తర్వాత మలమంటి దినేష్ ఇంటికి వెళ్లారు. అతడి తమ్ముడు సాయి అమ్మా అన్నయ్య ఫ్రెండ్స్ వచ్చారు... అన్నయ్య ఎక్కడకెళ్లాడు అని అడగడంతో ఆ తల్లి దుఃఖాన్ని కట్టడిచేయడం ఎవరివల్లా కాలేదు. తన కొడుకు ప్రోగ్రెస్ రిపోర్ట్, వేసిన పెయింటింగ్ చూపించి భోరున విలపించింది. తాను కౌలురైతైనప్పటికీ, ఆస్తిపాస్తులు లేకపోయినా తన కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నానంటూ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్కగానొక్కకొడుకు మరణంతో శోకం విద్యార్థులు అక్కడ నుంచి తాటికోరు సాం బయ్య, లక్ష్మికి ఇంటికి వెళ్లారు. ఒక్కగానొక్క కొడుకు శివ మరణంతో వారు తల్లడిల్లిపోతున్నారు. కృష్ణా నదికి వెళ్తానమ్మా అని అడిగేముందు ఆకలవుతుందంటూ చెప్పడంతో టిఫిన్ తీసుకొచ్చానని, టిఫిన్ తినకుండానే కృష్ణమ్మను చూసేందుకు పరుగులు తీసాడని సాంబయ్య విలపించాడు. కొడుకు తిరిగి మరలా వచ్చి అమ్మా కృష్ణమ్మకు దణ్ణం పెట్టుకోవాలి, కానుక వేయాలి అంటూ వెనక్కు వచ్చి డబ్బులు తీసుకువెళ్లాడని, తీరా ఆ కృష్ణమ్మ ఒడిలోనే శాశ్వతంగా నిద్రపోయాడని విద్యార్థులు, టీచర్ల ముందు తల్లి వాపోయింది. విద్యార్థులు మృతి చెందారన్న సం ఘటన తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తల్లితండ్రులను పరామర్శించేందుకు చిర్రావూరు తరలిరావడం విశేషం. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం తాడేపల్లి రూరల్: నలుగురు విద్యార్థుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం గురువారం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఒక్కొక్క విద్యార్థి కుటుంబానికి రూ.2లక్షలు ఇస్తున్నట్లు జిల్లాకు చెందిన మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు తెలియచేశారు. బాధితులను పరామర్శించేందుకు చిర్రావూరు వచ్చిన మంత్రులు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ఒక్కొక్క కుటుంబానికీ లక్ష రూపాయలు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక్కొక్కరికీ రూ.25 వేలు, గంజి చిరంజీవి నలుగురు కుటుంబాలకు రూ.40 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. -
నో బ్యాగ్.. నో హోంవర్క్
గుంటూరు ఎడ్యుకేషన్: బుడి బుడి అడుగులు వేసుకుంటూ పాఠశాలకు వెళ్లే చిన్నారులకు పుస్తకాల బ్యాగుల భారం తొలగనుంది. ఉదయాన్నే పుస్తకాల బ్యాగులను భుజానికెత్తుకుని, పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు వీపులు ఒంగిపోయే రీతిలో అవే బ్యాగులను మోసుకురావాల్సిన అవసరం ఇకపై ఉండదు. మోయలేని భారంగా మారిన బ్యాగులు, ఇంటికి వెళ్లాక సైతం వదలని హోంవర్క్ భారం నుంచి చిన్నారులకు ఉపశమనం కలిగిస్తూ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేప«థ్యంలో జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న పాఠశాలల్లో వీటిని అమలు చేయాల్సి ఉంది. ఒకటి, రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు బండెడు పుస్తకాలతో నిండిన బ్యాగులు, హోం వర్క్ కారణంగా వారిలో ఎదిగే వయసులో సహజంగా బయటకు రావాల్సిన సృజనాత్మకత నైపుణ్యాలు దెబ్బతిని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో 6,7 ఏళ్ల వయసు చిన్నారులకు ఇది ఎంత మాత్రం సరైనది కాదని పేర్కొంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైకోర్టు సైతం వారితో ఏకీభవించి, దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీబీఎస్ఈ బోర్డును ఆదేశించింది. సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వుల ప్రకారం 1, 2వ తరగతుల చిన్నారులకు నో బ్యాగ్... నో హోం వర్క్‌ను అమలు పర్చాల్సి ఉంది.ఈ విధానంపై సీబీఎస్ఈ బోర్డు గతంలోనే మార్గదర్శకాలు విడుదల చేసినప్పటికీ దేశ వ్యాప్తంగా అమలుకు నోచుకోలేదు. ర్యాంకులు, మార్కుల వేటలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఈ విధానానికి విరుద్ధంగా వ్యహరిస్తున్నాయి. దీంతో సీబీఎస్ఈ బోర్డు ఉత్తర్వులు అటకెక్కాయి. దీనిపై పలువురు విద్యావేత్తలు ఇటీవల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారి వాదనలతో ఏకీభవించింది. ఒకటి, రెండో తరగతులకు అమలు సీబీఎస్ఈ బోర్డు విడుదల చేసిన మార్గదర్శకాలు ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే పూర్తిస్థాయిలో అమలు చేయాలని కచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపధ్యంలో జిల్లాలోని ఆయా పాఠశాలల్లో అమలు పర్చే విధానంపై అధికార యంత్రాంగం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా జిల్లాలో సీబీఎస్ఈ బోర్డు గుర్తింపు పొందిన పాఠశాలలు 40 ఉండగా, గుంటూరు నగర పరిధిలోని కేంద్రీయ విద్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు యాజమాన్యంలో మరో 39 పాఠశాలలు ఉన్నాయి. చర్యలు చేపడతాం సీబీఎస్ఈ బోర్డు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ నిర్వహిస్తున్న పాఠశాలలకు ఆదేశాలు జారీ చేస్తాం. సీబీఎస్ఈ బోర్డు ఉన్నతాధికారులను సంప్రదించి సక్రమంగా అమలు జరిగేలా పర్యవేక్షిస్తాం. సీబీఎస్ఈ సిలబస్‌లో తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు ఈ విధానాన్ని విధిగా అమలు పర్చాల్సిందే. – ఆర్ఎస్ గంగాభవానీ,జిల్లా విద్యాశాఖాధికారి -
బంగారం.. పోలీస్ బండారం
సాక్షి, గుంటూరు : అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడుతోంది. జిల్లాలో జరిగిన వేర్వేరు చోరీల్లో ఓ డీఎస్పీతోపాటు, ఇద్దరు సీఐలు, ఓ ఎస్ఐ దొంగ సొమ్మును దర్జాగా తమ జేబుల్లో వేసుకున్న సంఘటనలు ఆలస్యంగా వెలుగు లోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. గతంలో వట్టిచెరుకూరులో పనిచేసి, ప్రస్తుతం గుంటూరులోని ఓ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ కొంతకాలం కిందట ద్విచక్ర వాహనాల దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా, బైక్‌లతోపాటు బంగారం కూడా చోరీ చేసినట్టు తేలింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఓ వ్యాపారికి ఆ బంగారాన్ని విక్రయించినట్టు చెప్పడంతో, దొంగను వెంటతీసుకు వెళ్లి సుమారు 200 గ్రాముల బంగారాన్ని ఎస్ఐ రికవరీ చేశారు. ఆ తరువాత దొంగను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచే సమయంలో ద్విచక్ర వాహనాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపించిన ఎస్ఐ ఆ 200 గ్రాముల బంగారాన్ని నొక్కేశాడు. ఈ సంఘటన అనంతరం ఆ దొంగ గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసు లకు చిక్కాడు. పోలీసులకు పాత విషయాలు చెబుతూ ఆ 200 గ్రాముల బంగారాన్ని ఎస్ఐ నొక్కేసిన సంఘటనను బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎస్ఐపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదిలావుంటే, పాతగుంటూరు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ సంఘటనలో ఓ దొంగను అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 250 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి పంచుకున్నట్టు సమాచారం. అప్పట్లో గుంటూరు నగర పరిధిలో పనిచేసిన ఓ డీఎస్పీతోపాటు, ఓ సీసీఎస్ సీఐ, మరో లా అండ్ ఆర్డర్ సీఐ కలసి ఈ సొమ్ము కాజేసినట్టు తెలిసింది. ఇటీవల సదరు దొంగ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో గతంలో తన వద్ద రికవరీ చేసిన 250 గ్రాముల బంగారాన్ని గుంటూరు జిల్లాకు చెందిన డీఎస్సీ, ఇద్దరు సీఐలు కలిసి కాజేశారని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ మేరకు కాకినాడ సీసీఎస్ డీఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్‌ను కలసి బంగారం కాజేసిన డీఎస్పీ, సీఐల గురించి చెప్పినట్లు సమాచారం. దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో వరసగా అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగలు దొరికితే వెంటనే తమ పరిధిలో ఉన్న సీసీఎస్ పోలీసులకు అప్పగించి వారి ద్వారా బంగారాన్ని రికవరీ చేయిస్తున్నారు.