నిందితుల వివరాలు వెల్లడిస్తున్న అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్ , రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దారి దోపిడీలు, అత్యాచారాలకు పాల్పడే అత్యంత కిరాతక ముఠాను అరెస్ట్ చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్బన్ ఎస్పీ కె.ఆరిఫ్‌హఫీజ్, రూరల్ ఏఎస్పీలు ఎన్.వి.ఎస్.మూర్తి (క్రైం), వై.రిశాంత్‌రెడ్డి (అడ్మిన్)తో కలిసి ఆదివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వద్ద అత్యాచార ఘటన, డిసెంబర్ 6, 7 తేదీల్లో యడ్లపాడు పరిధిలోని లింగారావుపాలెం రోడ్డులో, సొలస వెళ్లే రోడ్‌లో దారి దోపిడీలు జరిగాయి. పాలడుగు ఘటన సంచలనం సృష్టించింది. ఎనిమిది ప్రత్యేక బృందాలతో జల్లెడ పట్టి నిందితులను పట్టుకున్నారు.
అరెస్టయింది వీరే..
ఈ నెల 8న కర్నూలు జిల్లా నంద్యాల టౌన్ మహానందిరోడ్డు యానాది సంగం కాలనీకి చెందిన ఎ.లింగమయ్య, చిందుకూరు వాసి డి.ఓబులేసు, డి.లింగమయ్య, పాణ్యంటౌన్ వాసి సీహెచ్ హనుమంతు, నెమలికుంట గ్రామవాసి డి.వెంకన్నను చంఘీజ్‌ఖాన్‌పేట గ్రామ పరిధిలోని కొండవీటి కొండల్లో, 9న ఇ.రమణయ్యను నంద్యాలలో అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.73 లక్షల బంగారం/వెండి సొత్తు, కర్రలు, కత్తులు, సుత్తులు స్వాధీనం చేసుకోగా, రిమాండ్ నిమిత్తం వారిని చిలకలూరిపేట ఏజేసీజే కోర్టుకు తరలించారు.
ఇలా చేసేవారు..
కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన లింగమయ్యకు డి.జమ్ములు, సుంకన్న, ఓబులేసు బావమరుదులు. డి.జమ్ములు కొడుకు చిన్న లింగమయ్య, వారి బంధువులైన అంకన్న, చిన్న హనుమంతు ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి వేళల్లో మోటారు సైకిళ్లపై, నడిచి వెళ్లే జంటలను లక్ష్యంగా చేసుకొని దోపిడీ చేశాక మహిళలపై సామూహిక అత్యాచారాలకు తెగబడేవారు. వీరంతా యువకులే. ఇద్దరు పరారీలో ఉన్నారు.
నేరాలివే..
► గతేడాది సెప్టెంబర్ 8న పాలడుగు వెళ్లే దారిలో చెట్టు కొమ్మను రోడ్డుపై వేసి, భార్య భర్తను అడ్డగించి పొలంలోకి తీసుకెళ్లారు. భర్తను చితకబాది, భార్యపై అత్యాచారం చేసి బంగారు వస్తువులు, డబ్బులు లాక్కున్నారు.
► డిసెంబర్ 6న లింగారావుపాలెం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను మరణాయుధాలతో అడ్డగించి గాయపరిచారు. నగలు, నగదు దోపిడీ చేశారు.
► డిసెంబర్ 7న సొలస గ్రామం వెళ్లే రోడ్డులో రెండు ద్విచక్ర వాహనాలను అడ్డగించి వారిని చితకబాది నగలు, నగదు ఎత్తుకెళ్లారు. అర్బన్ పరిధిలో 18 దారి దోపిడీ కేసులు, రూరల్ పరిధిలో 5 కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment