సాక్షి, గుంటూరు : అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడుతోంది. జిల్లాలో జరిగిన వేర్వేరు చోరీల్లో ఓ డీఎస్పీతోపాటు, ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐ దొంగ సొమ్మును దర్జాగా తమ జేబుల్లో వేసుకున్న సంఘటనలు ఆలస్యంగా వెలుగు లోకి వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
గతంలో వట్టిచెరుకూరులో పనిచేసి, ప్రస్తుతం గుంటూరులోని ఓ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ కొంతకాలం కిందట ద్విచక్ర వాహనాల దొంగను అదుపులోకి తీసుకుని విచారించగా, బైక్‌లతోపాటు బంగారం కూడా చోరీ చేసినట్టు తేలింది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఓ వ్యాపారికి ఆ బంగారాన్ని విక్రయించినట్టు చెప్పడంతో, దొంగను వెంటతీసుకు వెళ్లి సుమారు 200 గ్రాముల బంగారాన్ని ఎస్‌ఐ రికవరీ చేశారు.
ఆ తరువాత దొంగను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచే సమయంలో ద్విచక్ర వాహనాలు మాత్రమే స్వాధీనం చేసుకున్నట్లు చూపించిన ఎస్‌ఐ ఆ 200 గ్రాముల బంగారాన్ని నొక్కేశాడు.
ఈ సంఘటన అనంతరం ఆ దొంగ గుంటూరు రూరల్ సీసీఎస్ పోలీసు లకు చిక్కాడు. పోలీసులకు పాత విషయాలు చెబుతూ ఆ 200 గ్రాముల బంగారాన్ని ఎస్‌ఐ నొక్కేసిన సంఘటనను బయటపెట్టాడు. దీంతో పోలీసులు ఈ విషయాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎస్‌ఐపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇదిలావుంటే, పాతగుంటూరు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీ సంఘటనలో ఓ దొంగను అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 250 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి పంచుకున్నట్టు సమాచారం. అప్పట్లో గుంటూరు నగర పరిధిలో పనిచేసిన ఓ డీఎస్పీతోపాటు, ఓ సీసీఎస్ సీఐ, మరో లా అండ్ ఆర్డర్ సీఐ కలసి ఈ సొమ్ము కాజేసినట్టు తెలిసింది.
ఇటీవల సదరు దొంగ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సీసీఎస్ పోలీసులకు చిక్కాడు. వారి విచారణలో గతంలో తన వద్ద రికవరీ చేసిన 250 గ్రాముల బంగారాన్ని గుంటూరు జిల్లాకు చెందిన డీఎస్సీ, ఇద్దరు సీఐలు కలిసి కాజేశారని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.
ఈ మేరకు కాకినాడ సీసీఎస్ డీఎస్పీ గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్‌ను కలసి బంగారం కాజేసిన డీఎస్పీ, సీఐల గురించి చెప్పినట్లు సమాచారం. దీనిపై కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో వరసగా అవినీతి పోలీసు అధికారుల బండారం బయటపడుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దొంగతనాలు, దోపిడీలు, చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగలు దొరికితే వెంటనే తమ పరిధిలో ఉన్న సీసీఎస్ పోలీసులకు అప్పగించి వారి ద్వారా బంగారాన్ని రికవరీ చేయిస్తున్నారు.
బంగారం.. పోలీస్ బండారం
Published Thu, Dec 25 2014 1:41 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement