
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రదొంగలపై సస్పెక్టెడ్ షీట్లు
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
సమావేశంలోగుంటూరు రేంజ్ ఐజీ
నెల్లూరు(క్రైమ్): ఎర్రచందనం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణచివేయాలని గుంటూరు రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ పోలీసు, అటవీ అధికారులకు సూచించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను నియంత్రించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన గురువారం స్థానిక ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు, అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఐజీ మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడే, సహకరించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్నారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలైన సోమశిల, రాపూరు, ఉదయగిరి, మర్రిపాడు తదితర ప్రాంతాల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలపై ఇకమీదట ప్రతి సోమవారం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోని ఎస్‌ఐలు తీసుకొంటున్న చర్యలు? ఎంత మందిని అరెస్ట్‌చేశారు? ఎన్ని కేసులు నమోదయ్యాయి తదితర వివరాలను విధిగా తెలియచేయాలన్నారు. దాని ఆధారంగానే వారి పనితీరును అంచనా వేస్తామన్నారు.గతంలో ఎర్రచందనం కేసుల్లో అరెస్ట్ అయిన వారిపై వెంటనే సస్పెక్టెడ్ షీట్లు తెరవాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించినా? నియంత్రణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత అధికారులపై వేటు తప్పదని, అవసరమైతే క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు.
గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన సోమశిల కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ కథనాన్ని ఆయన పరిశీలించారు. ఎస్పీ నవదీప్ సింగ్ ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు తీసుకొంటున్న చర్యలను ఐజీకి వివరించారు. అటవీశాఖ అధికారులు నేరస్తులను పట్టుకునేందుకు గ్రామాల్లోకి వెళ్లిన సమయంలో రాజకీయనాయకులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోందన్నారు. దీంతో నిందితులు తప్పించుకుంటున్నారని ఐజీ దృష్టికి తీసుకొచ్చారు. దానిపై స్పందించిన ఐజీ స్థానిక పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేయాలని, అటవీ అధికారులకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ సమావేశంలో అటవీశాఖ అధికారి రాంబాబు, ఏఎస్పీ రెడ్డి గంగాధర్‌రావు, డీఎస్పీలు పి. వెంకటనాథ్‌రెడ్డి, రాంబాబు, మాల్యాద్రి, బాలవెంకటేశ్వరరావు, చౌడేశ్వరి, ఓఎస్‌డీ శిల్పవల్లి, గూడూరు, కావలి, ఆత్మకూరు సబ్‌డివిజన్ పోలీసు అధికారులు, అటవీ అధికారులు, స్పెషల్‌బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు జి. శ్రీనివాసరావు, వై. జయరామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.