నేడు జిల్లా బంద్
నేడు జిల్లా బంద్
నిరంకుశంగా సాగిన రాష్ట్ర విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు బుధవారం జిల్లాలో బంద్ జరగనున్నది.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి బంద్‌ను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో టీబిల్లు ఆమోద సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు ఎమర్జెన్సీకన్నా దారుణంగా ఉందని రాజశేఖర్ విమర్శించారు.
తలుపులు వేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి చీకటిలో బిల్లును ఆమోదించినట్టు ప్రకటించటం ప్రజాస్వామ్య వ్యవస్థకే దుర్దినమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీల కుట్ర ఫలితంగా విభజన జరిగిందని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా తెలుగువారి అత్మగౌరవాన్ని మంటగలిపారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ, ఆర్టీసీ, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించి నిరసన తెలపాలని కోరారు. కాగా, విద్యార్ధి జేఏసీ ఆధ్వర్యంలో 48 గంటలపాటు సీమాంధ్రలో బంద్ జరగనున్నదని రాష్ట్ర కోఆర్డినేటర్ మండూరి తెలిపారు.