రాఘవేంద్రస్వామి నామస్మరణతో తుంగభద్ర నదీ తీరం పులకించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గురు వైభవోత్సవ కార్యక్రమాలు ఆదివారంతో నాల్గవ రోజుకు చేరుకున్నాయి.
మంత్రాలయం (కర్నూలు) : రాఘవేంద్రస్వామి నామస్మరణతో తుంగభద్ర నదీ తీరం పులకించింది. ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో గురు వైభవోత్సవ కార్యక్రమాలు ఆదివారంతో నాల్గవ రోజుకు చేరుకున్నాయి. శ్రీ మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో తెల్లవారుజాము నుంచి రాఘవేంద్రస్వామి మూల బృందావనంకు సుప్రభాతసేవ, నిర్మల విసర్జన, పాదపూజ, సంస్థాన పూజ నిర్వహించారు.
అనంతరం రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను బంగారులో పల్లకిలో శ్రీ మఠం మాడ వీధుల్లో ఊరేగించారు. పూజామందిరంలో మూల, దిగ్విజయ, జయరాములకు పీఠాధిపతి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, కేరళ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.