నాయుడుపేట, న్యూస్‌లైన్: గురుకుల పాఠశాలల విద్యార్థులపై అక్కడి అధికారులు చిన్నచూపు చూస్తున్నారు. పురుగులతో కూడిన అన్నం, ఉడికీఉడకని పొంగలి వడ్డిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కడుపు కాలుతుండటంతో నాసిరకమైన ఆహారాన్నే తిని విద్యార్థులు అర్ధాకలితో గడుపుతున్నారు. ఎవరికైనా చెబితే దండన తప్పదనే భయంతో బాధను మౌనంగా భరిస్తున్నారు. నాయుడుపేట మండలం పుదూరు బాలికల గురుకులంలో పరిస్థితి ఇది.
ఈ గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు 706 మంది విద్యార్థినులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వీరికి నాసిరకమైన ఆహారం వడ్డిస్తున్నారన్న సమాచారం అందుకున్న ‘న్యూస్‌లైన్’ శనివారం గురుకులాన్ని సందర్శించింది. ఆ సమయంలో విద్యార్థులకు వడ్డించిన అన్నంలో వడ్ల గింజలు దర్శనమిచ్చాయి. పుచ్చు వంకాయలతో చేసిన కూరనే వడ్డించారు. ఉదయం అల్పాహారంగా వడ్డించిన పొంగలి ఉడికీఉడకక నాసిరకంగా ఉండటంతో విద్యార్థులు తినలేకపోయారు. ‘న్యూస్‌లైన్’ రావడంతో అక్కడే ఉన్న ఆ పొంగలిని హడావుడిగా దాచేందుకు ప్రయత్నించారు.
వంట గదిలోని పురుగులు పట్టిన బియ్యాన్ని కూడా హడావుడిగా ప్రహరీ అవతల పోసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో ఆ బియ్యం చెల్లాచెదురుగా పడిపోయాయి. కాంట్రాక్టర్ సరఫరా చేసిన టమోటాలు, చింతపండు తదితర వస్తువులను కొందరు సిబ్బంది ఇళ్లకు ఎత్తుకెళ్లేందుకు దాచుకోవడం కనిపించింది. మరోవైపు విద్యార్థులు భోజనం చేసే సమయంలో తాగునీరు లేక తీవ్ర అవస్థ పడుతున్నారు. జగ్గుతో నీళ్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో విద్యార్థులు పంచుకుని తాగుతున్నారు. వీరు ఇన్ని కష్టాలు పడుతున్నా గురుకులం అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. సరుకుల కాంట్రాక్టర్, వంట ఏజెన్సీల నిర్వాహకులు ఇచ్చే మామూళ్లను తీసుకుని అక్రమాలు జరుగుతున్నా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని గురుకులంలోని కొందరు సిబ్బందే ఆరోపిస్తున్నారు.
నక్సల్స్ ఏరియాలో పనిచేశా.. ఎవ రికీ భయపడ ను
విద్యార్థులకు ఏజెన్సీలు ఇచ్చిందే వండిపెడుతాం. బాగానే వండి పెడుతున్నాం. అప్పడప్పుడూ జరిగేవి మామూలే కదా. పిలల్లతో చెప్పిచ్చమంటారా. నక్సల్స్ ఏరియాలో పనిచేసి వచ్చా. ఎవరికీ భయపడను.
- ఎల్ కిరణ్మయి, గురుకుల కళాశాల ప్రిన్సిపల్
మీ బిడ్డలకైతే ఈ ఆహారం పెడతారా?
Published Sun, Dec 15 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
Advertisement