అమ్మనబ్రోలు గురుకుల పాఠశాల
ఒత్తిడి లేని ఉత్తమ విద్యకు గురుకులాలు మార్గదర్శకాలవుతున్నాయి. కార్పొరేట్ పాఠశాలల్లో కూడా లేని వసతులు కల్పించి పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాలయాలను ఏర్పాటు చేసింది. డిజిటల్ విద్యాబోధనలందిస్తూ పిల్లల బంగారు భవిష్యత్‌కు పునాది వేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రచార లోపం, సమాచారం తెలియక అనేక మంది ఈ పాఠశాలల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నారు. జిల్లాలోని మూడు పాఠశాలల్లో ఈనెల 8న అయిదో తరగతి ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నారు.
నాగులుప్పలపాడు: ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు జిల్లాలో త్రిపురాంతకం మండలం గణపవరం, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామాల్లో మొత్తం 3 ఉన్నాయి. వీటిలో గణపవరం, సంతనూతలపాడులో బాలురకు అవకాశం కల్సిస్తే, అమ్మనబ్రోలు మాత్రం బాలికల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అన్ని సదుపాయాలతో ఉచితంగా విద్యనందిస్తారు. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఈనెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. జిల్లా మొత్తం మీద సుమారు 1500 మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ 3 గురుకులాల్లో ఒక్కో పాఠశాలలకు 80 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశాలు నిర్వహిస్తారు. వాటిని రోస్టర్ పద్ధతిలో కౌన్సెలింగ్ ద్వారా జనరల్ కేటగిరి –33, బీసీ ఏ–6, బీసీ బి–8, బీసీ సీ–1, బీసీ డి–6, మైనార్టీలకు–3, ఎస్సీ–12, ఎస్టీ–5, పీహెచ్‌సీ –2, అనాథ పిల్లలకు–2, ఎక్స్ సర్వీస్‌మెన్–2 పద్ధతిలో సీట్లు కేటాయిస్తారు. అంతే కాకుండా తాడికొండలోని ఎక్స్‌లెన్సీ స్కూల్‌కి గుంటూరు, నెల్లూరు జిల్లాలో ఉన్న మైనార్టీ బాలురతో పాటుగా విజయవాడ మైనార్టీ బాలికల గురుకులాల్లో మన జిల్లా కోటాకు సంబంధించి జిల్లాలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. గురుకులాల్లో విద్యార్థులకు మెయింటెనెన్స్ చార్జీలకు, కాస్మోటిక్ ఛార్జి–75 రూపాయలు, వాషింగ్ అలవెన్స్–10, విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నోట్ పుస్తకాలు–12 తో పాటుగా దుప్పట్లు, టవల్స్, 2 జతల యూనిఫామ్, గ్లాసు, ప్లేటు, ఇనుప పెట్టె, ఉచితంగా అందిస్తారు. అంతే కాకుండా ప్రతి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ కోసం, స్టాఫ్ నర్స్, వ్యాయామ సంబంధమైన వాటి కోసం పీఈటీ, డ్రాయింగ్ టీచర్ తప్పకుండా ఉంటారు.
అమ్మనబ్రోలు గురుకులంలో
జిల్లాలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసే క్రమంలో బాలికల కోసం అమ్మనబ్రోలు గ్రామంలో 1983 సంవత్సరంలో గురుకులాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులతో పాటు మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో దేశ, విదేశాలలో స్థిరపడ్డారు. మారుతున్న కాలానికి అనుగుణంగా గురుకులంలో విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, డిజిటల్ క్లాస్ రూం, కంప్యూటర్ తరగతులు, మినరల్ వాటర్ ప్లాంట్ వంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా ప్రత్యేకంగా విద్యుత్ కోసం 10 కేవీ పవర్ కలిగిన 11 లక్షల రూపాలయలతో సోలార్ ప్లేట్లు కూడా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment