సైకిలెక్కేందుకు..జీవీ ఎత్తు..!
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మాజీ ఎమ్మెల్యే జీవీ శ్రీనాథ్‌రెడ్డి సొంత గూటికి చేరే యత్నాలపై పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఇక్బాల్ అహ్మద్, మరో వర్గం నేత రవిప్రకాష్‌నాయుడు మండిపడుతున్నారు. తన ఓటమికి కారణమైన జీవీ శ్రీనాథరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవద్దని ఇక్బాల్ అహ్మద్.. కిరణ్ దన్నుతో తమను వేధించిన ఆయనను దరిచేరనివ్వద్దంటూ మరో వర్గం నేత రవిప్రకాష్‌నాయుడు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. జీవీని టీడీపీలోకి తెచ్చేందుకు యత్నిస్తున్న మంత్రి బొజ్జలపై ఆ నేతలు ఇద్దరూ మండిపడుతున్నారు. ఇప్పటికే పీలేరు నియోజకవర్గంలో వర్గ విభేదాలతో చీలికలు పేలికలైన టీడీపీ.. జీవీ రాకతో ఆ విభేదాలు మరింత ముదిరే అవకాశం ఉందని ఆపార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న జీవీ శ్రీనాథ్‌రెడ్డి ఎన్టీయార్ ప్రభంజనంలో 1994లో పీలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999, 2004 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో జీవీ శ్రీనాథ్‌రెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో 2009లో పీలేరు నుంచి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ చేసి, గెలుపొందారు. 2011లో అనూహ్యంగా కిరణ్‌కుమార్‌రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది.
పీలేరు నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు టీడీపీలో ఉన్న జీవీ శ్రీనాథ్‌రెడ్డికి కిరణ్ కాంగ్రెస్ తీర్థం ఇప్పించారు. ఆ తర్వాత ఆయనను టీటీడీ బోర్డు సభ్యుణ్ని చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కిరణ్ కాంగ్రెస్‌ను వీడి సమైక్యాంధ్ర పార్టీ స్థాపించడంతో జీవీ శ్రీనాథ్‌రెడ్డి కూడా ఆయన వెంటే నడిచారు. మొన్న జరిగిన ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థిగా కిరణ్ సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి పోటీచేశారు. కిషోర్‌కు దన్నుగా జీవీ నిలిచారు. కానీ.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి పీలేరు నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. సమైక్యాంధ్రపార్టీ స్థాపించిన కిరణ్ పత్తా లేకుండా పోవడంతో జీవీ శ్రీనాథ్‌రెడ్డి ఏకాకిగా మిగిలారు.
ఈ నేపథ్యంలోనే సైకిలెక్కేందుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో ఆయన మంతనాలు సాగిస్తున్నారు. దీన్ని పీలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఇక్బాల్ అహ్మద్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసిన జీవీ శ్రీనాథరెడ్డిని ఎలా పార్టీలో చేర్చుకుంటారని ఇటీవల చంద్రబాబును ఇక్బాల్ నిలదీశారు. పీలేరు నియోజకవర్గంలో ఇక్బాల్‌ను వ్యతిరేకిస్తోన్న మరో నేత రవిప్రకాష్‌నాయుడు సైతం టీడీపీలోకి జీవీ శ్రీనాథ్‌రెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై ఇటీవల చంద్రబాబుతో రవిప్రకాష్‌నాయుడు చర్చించినట్లు ఆపార్టీ వర్గాలు వెల్లడించాయి.
పీలేరు నియోజకవర్గంలో ఇక్బాల్ అహ్మద్, రవిప్రకాష్‌నాయుడు వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. ఇది ఆ నియోజకవర్గంలో టీడీపీని బలహీనంగా మార్చింది. ఈ నేపథ్యంలో జీవీ శ్రీనాథ్‌రెడ్డిని టీడీపీలో చేర్చుకుంటే మూడో వర్గం ఏర్పడటానికి దారితీస్తుందని ఆపార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వర్గ విభేదాలతో చిక్కిశల్యమైన టీడీపీని జీవీ శ్రీనాథ్‌రెడ్డి రాక మరింత బలహీనపరుస్తుందని ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.