► హెచ్‌డబ్ల్యూఓలకు రెండు నెలలుగా అందని జీతాలు
► ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు
► రూ.30 లక్షల నిధులు ల్యాప్స్
కర్నూలు(అర్బన్) : ఉగాదిని అందరు ఎంతో సంతోషంగా జరుపుకున్నా.. సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ సంక్షేమాధికారులు మాత్రం ఇబ్బందుల మధ్య నిర్వహించుకోవాల్సి వచ్చింది. రెండు నెలలుగా వసతి గృహ సంక్షేమాధికారులకు జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలకు సంబంధించి జీతాలు విడుదల కాలేదు. ఫిబ్రవరికి సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను సమాచారాన్ని అందించడంలో కొందరు హెచ్‌డబ్ల్యూఓలు చేసిన జాప్యం వల్ల జీతాల విడుదలలో ఆలస్యం జరిగినట్లు తెలుస్తోంది. మార్చికి సంబంధించి జీతాల బిల్లులను ట్రెజరీకి పంపినా మంజూరు కాలేదు. దీంతో రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు పండుగ పూట ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఐదు ట్రెజరీల్లో పాస్ కాని డైట్ బిల్లులు
జిల్లాలోని కర్నూలు, ఎమ్మిగనూరు, గూడూరు, ఆళ్లగడ్డ, ఆలూరు ట్రెజరీ కార్యాలయాల్లో వసతి గృహాలకు సంబంధించిన మార్చి నెల డైట్ బిల్లులు పాస్ కానట్లు సమాచారం. సాధారణంగా ప్రతి నెలా 19 నుంచి 24వ తేదీలోగా డైట్ బిల్లులను ఆయా ట్రెజరీ కార్యాలయాలకు అందజేయాల్సి ఉంది. అందరు వసతి గృహ సంక్షేమాధికారులు నిర్ణీత సమయంలోనే ట్రెజరీలకు బిల్లులను అందజేసినా, మార్చి చివరిలో మంజూరు కావాల్సిన బిల్లులు పాస్ కాలేదు. దీంతో దాదాపు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బడ్జెట్ ల్యాప్స్ అయినట్లు తెలుస్తోంది.
సమస్యను డీడీ దృష్టికి తీసుకువెళ్లాం- శ్రీరామచంద్రుడు, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జెడ్ దొరస్వామి, కే బాబు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితిని, ఆయా ట్రెజరీల్లో మంజూరు కానీ డైట్ బిల్లుల విషయాన్ని తమ శాఖ ఉప సంచాలకుల దృష్టికి తీసుకువెళ్లాం. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రెండు నెలల జీతాలతో పాటు డైట్ బడ్జెట్ కూడా ల్యాప్స్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్‌లో ఉన్న జీతాలతో పాటు డైట్ బడ్జెట్‌ను ఇప్పించాలి. డైట్ బడ్జెట్ రాకుంటే వసతి గృహ సంక్షేమాధికారులు మరిన్ని ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు.
పండగపూట పస్తులే!
Published Sat, Apr 9 2016 4:00 AM | Last Updated on Mon, Oct 22 2018 7:32 PM
Advertisement
Advertisement