హై‘టెన్షన్’ | Haitensan ' | Sakshi
Sakshi News home page

హై‘టెన్షన్’

Published Sun, Jan 4 2015 1:45 AM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

హై‘టెన్షన్’ - Sakshi

హై‘టెన్షన్’

నరసరావుపేట రూరల్: మండలంలోని రావిపాడు సమీపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు శనివారం ఉదయం హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి హడావిడి చేశాడు. భార్యతో మనస్పర్థల నేపథ్యంలో ఆమె వేధింపులకు తోడు పోలీసుల వేధింపులు కూడా తోడవడంతో విద్యుత్ టవర్ ఎక్కిన బాధితుడు ఐదు గంటల హైడ్రామా నడుమ కిందకు దిగడంతో టెన్షన్‌కు తెరపడింది. వివరాలిలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలేనికి చెందిన ఆలకుంట నాగరవీంద్ర తాపీమేస్త్రీగా పనిచేస్తుంటాడు.

మార్టూరుకు చెందిన రత్తమ్మతో నాలుగు నెలల క్రితం వివాహమైంది. పెళ్లయిన నెలరోజులకే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. స్థానిక పోలీసుస్టేషన్ రత్తమ్మ భర్తపై ఫిర్యాదుచేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించారు. బయటకు వచ్చిన రవీంద్ర భార్యకు దూరంగా మాచర్లలో పనికి వెళ్లాడు. మళ్లీ రెండు రోజుల క్రితం పోలీసుస్టేషన్‌లో రవీంద్రపై ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి తన సోదరుడు తెలియపర్చడంతో రవీంద్ర ఆందోళనకు గురయ్యాడు.

ఈ నేపథ్యంలో మాచర్ల నుంచి వస్తూ మార్గంమధ్యలో రావిపాడు వద్ద హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నిస్తున్నట్లు శనివారం ఉదయం ఆరు గంటల సమయంలో సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళనకు గురైన రవీంద్ర కుటుంబ సభ్యులు వెంటనే బయలుదేరారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో రవీంద్ర ఎక్కిన విద్యుత్ టవర్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

 ఐదు గంటలు హైడ్రామా..
 రవీంద్ర ఎక్కిన టవర్ శ్రీశైలం-విజయవాడ 400 కేవీ విద్యుత్ లైన్ కావడంతో అక్కడకు చేరుకున్నవారిలో ఆందోళన నెలకొంది. పోలీసులు విద్యుత్‌శాఖ అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. ఈ సంఘటన తెలిసిన స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ముందుగా పోలీసులు రవీంద్రతో ఫోన్‌లో మాట్లాడారు. నీ భార్యతో మాట్లాడి విడాకులు ఇప్పించేవిధంగా ఒప్పిస్తామని కిందకు దిగిరావాలని కోరారు.

అందుకు రవీంద్ర ఒప్పుకోలేదు. కిందకు వస్తే అరెస్టు చేసి కొడతారని చెప్పి సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. తొమ్మిది గంటల సమయంలో రూరల్ ఎస్‌ఐ ఆనంద్, రవీంద్ర తల్లిదండ్రులు, బంధువులు చేరకుని నచ్చజెప్పడంతో గంటన్నర తర్వాత ఎట్టకేలకు కిందకు దిగాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

 వేధింపులు తట్టుకోలేకే..
 రత్తమ్మతో వివాహం ఇష్టం లేదని, తనతో వివాహేతర సంబంధం అంటగట్టి కేసు పెట్టి బలవంతంగా పెళ్లి చేశారని రవీంద్ర వాపోయాడు. ఆమెకు అంతకుముందే మరొకరితో వివాహమైందన్నాడు. రత్తమ్మతో వివాహమయ్యాక పలుమార్లు ఆమె బంధువులు తమ ఇంటికి వచ్చి దాడులు చేశారన్నాడు. అయినా తమపైనే కేసులు పెట్టి వేధించారని, అవి తట్టుకోలేక ఇలా చేశానని రవీంద్ర చెప్పాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement