చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టం చేయండి
► నామమాత్రంగా చర్యలు చేపడితే
► ఆందోళన ఉధృతం చేస్తాం
► చేనేత నాయకుల హెచ్చరిక
ధర్మవరం టౌన్ : చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టం చేయూలని చేనేత సంఘాల నాయకులు కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ బృందాన్ని డిమాండ్ చేశారు. చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ కమిటీ బృందం శుక్రవారం ధర్మవరంలో పర్యటించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సురేశ్‌చంద్ర, రీజినల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ ఆదినారాయణ, ఆర్‌డీడీ కపిలేశ్వరరావు, ఏడీ జగన్నాథశెట్టిల బృందం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో చేనేత నాయకులతో సమావేశమైంది. చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న పవర్‌లూమ్స్‌పై చర్యలు తీసుకొని 11రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి నాయకుల అభిప్రాయూలను తీసుకున్నారు.
ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలా రామాంజనేయులు, గాంధీ చేనేత సంఘం అధ్యక్షుడు పిట్టా వెంకటస్వామి, ఇతర చేనేత నాయకులు కేంద్ర బృందంతో మాట్లాడారు. మరమగ్గాల వల్ల చేనేత రంగం నిర్వీర్యం అవుతోందన్నారు. 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మరమగ్గాల యజమానులతో కుమ్మక్కయ్యూరన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సురేష్ చంద్రకు ఫిర్యాదు చేశారు. అంతేకాక రిజర్వేషన్ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి, కర్ణాటక, తమిళనాడు, జిల్లాలోని ముదిరెడ్డిపల్లి, గోరంట్ల ప్రాంతాలలో మరమగ్గాల్లో ప ట్టు ఉత్పత్తులు తయారు చేస్తున్నా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
దీంతో అధికారులకు చేనేత నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ మరమగ్గాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సురేశ్‌చంద్ర ‘సాక్షి’తో మాట్లాడుతూ మరమగ్గాల్లో పట్టు ఉత్పత్తుల తయారీని ఉపేక్షించేది లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్‌లూమ్స్ ఏడీ పవన్‌కుమార్, డీవో సుబ్బానాయుడు పాల్గొన్నారు.