త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి.
సాక్షి, కర్ణాటక: త్వరలో జరిగే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవి కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బళ్లారి లోక్‌సభ సభ్యుడు శ్రీరాములుకు చోటు దక్కే అవకాశం ఉందని కర్ణాటకలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రక్షణ శాఖ మంత్రి పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, మరో కేంద్ర మంత్రి మృతితో పాటు వెంకయ్య నాయుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఉప రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో మంత్రివర్గంలో ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి భర్తీకి ఈనెల 25లోగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నట్లు చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో కర్ణాటక నుంచి ఉడిపి ఎంపీ శోభా కరందాజ్లే, హవేరీ ఎంపీ శివకుమార్ ఉదాసీ, బెళగావి ఎంపీ సురేష్ అంగడి, బెంగళూరుకు చెందిన మోహన్ పేర్లు వినిపిస్తున్నాయి. కర్ణాటక నుంచి ఇద్దరిని క్యాబినెట్‌లోకి తీసుకోవాలని ఆలోచనతో ఉన్న మోదీ ఎంపీ శ్రీరాములు పేరునూ పరిశీలనలోకి తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఢిల్లీకి వెళ్లిన శ్రీరాములు అక్కడే మకాం వేసి ఈ దిశగా ప్రయత్నిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.