సాక్షి, బెంగళూరు : మరో ఇరవై నాలుగు గంటల్లో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఉమేశ్ కట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆధ్వర్యంలో బుధవారం జరిగే పార్టీ సమావేశానికి హాజరయ్యే ముందు ఉమేశ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు మాతో(బీజేపీకి) టచ్‌లో ఉన్నారు. వాళ్లు ప్రభుత్వం నుంచి బయటకు వస్తారు. కాబట్టి మరో ఇరవై నాలుగు గంటల్లో కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుంది. అలాగే వారం రోజుల్లోగా బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది’ అంటూ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా... యడ్యూరప్ప మాత్రం ప్రభుత్వ ఏర్పాటు గురించి భిన్నంగా స్పందించారు. ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. ‘ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇకపై కూడా అలాగే కొనసాగుతాము’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమాస్వామి ఇటీవలే తన మంత్రివర్గాన్ని విస్తరించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మంత్రులుగా ఆయన అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి వంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో రాజ్‌భవన్ ముందు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో ఉమేశ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు మాట్లాడుతూ... దమ్ముంటే ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. లేనిపక్షంలో ఉమేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment