ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తి చేస్తారు?
ఎంపీ మిథున్‌రెడ్డి ప్రశ్న
మదనపల్లె: ఏ...నవంబర్‌కు హంద్రీ-నీవా పూర్తవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం మదనపల్లెలో ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్‌కే హంద్రీ-నీవాను పూర్తిచేసి రాయలసీమకు నీటిని సరఫరా చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు చిత్తశుద్ధితో పనులు చేసిన దాఖలాలు లేవన్నారు. హద్రీ-నీవా కాలువ పనులకు సంబంధించి ఇంకా 16 లిఫ్ట్ పనులు, మదనపల్లె సమీపంలో టన్నెల్ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.
టన్నెల్ పనులు పూర్తికావడానికి మరో ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, మొదటి నుంచి నవంబర్ నాటికి హంద్రీ-నీవా పూర్తి చేస్తామని చెబుతున్నారేగానీ, అది ఏ సంవత్సరం నవంబర్ నాటికో స్పష్టీకరించాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే 2019 నవంబర్ నాటికైనా నీళ్లు ఇస్తారా ? అనే సందేహం కలుగుతోందన్నారు. కాగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు మంజూరుకాగా, వాటిలో ఒకటి రాజంపేటకు.. రెండవది మదనపల్లెకు మంజూరైనట్లు చెప్పారు. అయితే మదనపల్లెలో గత ఏడాది నుంచి ఈ విద్యాలయానికి స్థల సేకరణలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని తెలిపారు.
పార్టీలో సీనియర్లకు సముచిత స్థానం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులకు, ప్రజాప్రతినిధులకు సమూచిత స్థానం ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. అధికార పక్షం మైండ్ గేమ్ ఆడుతోందని, పార్టీ మారుతున్న వారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాబ్‌జాన్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి షమీం అస్లాం, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, నీరుగట్టు వెంకటరమణారెడ్డి, మహ్మద్ రఫీ, ముక్తియార్‌ఖాన్, సుగుణ, వేమనారాయణ, ఎంపీపీలు జరీనహైదర్, సుజన బాలకృష్ణారెడ్డి, జిల్లా యువజన విభాగం కార్యదర్శి ఎస్‌ఏ కరీముల్లా, కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు షరీఫ్, టెలికామ్ బోర్డు మెంబర్ దండాల రవిచంద్రారెడ్డి, నాయకులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.