సాక్షి, అమరావతి: కుప్పం మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరిగాయని వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి స్పష్టంచేశారు. ఇక్కడి ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని నిరూపించగలరా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు. మొత్తం 48 పోలింగ్ బూత్‌లలో ఏ బూత్‌లోనైనా దొంగ ఓట్లు వేసి ఉంటే వాటిపై ఏ బూత్‌లోనైనా టీడీపీ ఏజెంట్లు ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించారు. ఒక్క ఫిర్యాదు కూడా చేయకుండా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఎలా ఆరోపిస్తారని బాబును ప్రశ్నించారు.
కుప్పం నియోజకవర్గంలో 85% పంచాయతీల్లోనూ.. 90% ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలిచిందని.. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ ఫలితాలు తద్భిన్నంగా రావని.. వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం ఖాయమనే అంచనాకు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కట్టుకథలు అల్లుతున్నారని మిథున్‌రెడ్డి మండిపడ్డారు. కుప్పంలో దొంగ ఓట్లు చేర్చారని చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు రివర్స్ గేర్‌లో మాపై ఆరోపణలు చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తాడేపల్లిలోని వైస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
ఏజెంట్లు, అభ్యర్థులెవరూ ఫిర్యాదు చేయలేదు
‘కుప్పం మున్సిపాలిటీకి సోమవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓట్లు వేశారని.. చంద్రబాబు, టీడీపీ నేతలు, ఆ పార్టీకి వత్తాసు పలికే అనుకూల మీడియాలో పెద్దఎత్తున కథనాలు రాశారు. అవన్నీ కట్టుకథలే. లోకేశ్ రెండ్రోజులపాటు కుప్పంలో మకాం వేసి.. ఆ పార్టీలో బలమైన, సీనియర్ నేతలను పోలింగ్ బూత్‌లలో ఏజెంట్లుగా నియమించారు. ప్రతి బూత్‌లో ఎన్నికల అధికారి, టీడీపీ ఏజెంటు, వైఎస్సార్‌సీపీ ఏజెంటు వద్ద కలర్ ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా ఉంటుంది. ఫలానా వ్యక్తి దొంగ ఓటు వేయడానికి వచ్చాడనిగానీ, ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు పోల్ అయ్యాయనిగానీ 48 మంది టీడీపీ ఏజెంట్లు.. 24 మంది టీడీపీ అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. అక్రమాలు జరిగినట్లు ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. ప్రతి బూత్‌లో ఏం జరుగుతుందన్నది ఎస్‌ఈసీ వెబ్‌కామ్ ద్వారా వీడియోలలో రికార్డు చేసింది.
చదవండి: (మా పార్టీ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే: సజ్జల)
అక్రమాలు జరిగింది ఎక్కడ?
చంద్రబాబూ.. ఫలానా బూత్‌లో దొంగ ఓట్లు వేశారు, అక్రమాలు జరిగాయని.. వెబ్‌కామ్‌ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను చూపాలని ఎస్‌ఈసీని కోరండి. మేం కూడా అదే బూత్‌లో ఏం అక్రమాలు జరిగాయో చెప్పాలని ఎస్‌ఈసీని కోరుతాం. అందుకు మీరు సిద్ధమా? అసలు.. ఓటరు కాని వ్యక్తి దొంగ ఓట్లు ఎలా వేయగలుగుతాడు? ఓటరు జాబితాలో ఉన్న ఒకరి ఓటును మరొకరు వేయాలి. అప్పుడు అన్ని పార్టీల ఏజెంట్లు బూత్‌లలో ఉంటారు. దొంగ ఓటు వేస్తే ఏజెంట్లు పోలింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తారు. ఒక్క బూత్‌లోనూ దొంగ ఓటర్లు వచ్చారని గొడవలు జరిగిన దాఖలాలు లేవు.
దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే
దొంగ ఓట్లతో నెగ్గే సంస్కృతి చంద్రబాబుదే. ఆ సంస్కృతిని వైఎస్సార్‌సీపీపై రుద్దితే ఎలా? కుప్పంలో 28వేల దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి 2014లో వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ చేసిన ఎన్నికల సంఘం 18 వేల ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఇంకా పది వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నీ చంద్రబాబు చేర్పించిన దొంగ ఓట్లే. ఆ ఓట్లతోనూ.. దౌర్జన్యాలతోనూ ఇన్నాళ్లూ కుప్పంలో చంద్రబాబు నెగ్గుతూ వస్తున్నారు. కుప్పం ప్రజలకు ఇప్పటివరకూ చంద్రబాబు చేసిందేమీ లేదు.
రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాల తరహాలోనే కుప్పం నియోజకవర్గాన్ని సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి చేస్తున్నారు. కుప్పంలో చంద్రబాబు కేవలం 1,300 పక్కా ఇళ్లు ఇస్తే.. రెండున్నరేళ్లలో సీఎం జగన్ 5 వేలకుపైగా మంజూరు చేశారు. హంద్రీ–నీవాలో నీళ్ల లభ్యత తక్కువ ఉంది కాబట్టి, గాలేరు–నగరితో అనుసంధానం చేసి కుప్పానికి నీళ్లు ఇవ్వబోతున్నారు. ఇవన్నీ గుర్తించే కుప్పం ప్రజలు సీఎం జగన్ వెంట నడుస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుంది’.
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
‘కుప్పం ఓట్ల లెక్కింపుపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’ అని మీడియా ప్రశ్నకు సమాధానంగా మిథున్‌రెడ్డి చెప్పారు. ‘చంద్రబాబు గత 30 ఏళ్లుగా మా నాన్నని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా.. ప్రజల ఆశీర్వాదంతో మేమే గెలుస్తాం’ అని మరో ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
పనులపై వచ్చిన వారిని దొంగ ఓటర్లు అంటారా?
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో కుప్పం ఉంది. పనుల నిమిత్తం వెళ్తున్న వారిని కుప్పం బస్టాండ్ నుంచి పట్టుకువచ్చి వారే దొంగ ఓటర్లు అని టీడీపీ నానా యాగీ చేసి.. భయానక వాతావరణం సృష్టించింది. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా దొంగ ఓట్లు వేశారని చూపించిన వీడియోల్లో.. ఏ ఒక్కరి వేలిపైనైనా ఓటు వేసినట్లు ఇంకు గుర్తు ఉందా అంటే లేదు. అంటే ఓటే వేయని వారిని చంద్రబాబు, టీడీపీ నేతలు దొంగ ఓటర్లుగా చిత్రీకరించినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. దొంగ ఓటర్లంటూ టీడీపీ పట్టుకున్న వ్యక్తులంతా రామకుప్పం మండలానికి చెందిన టీడీపీ మద్దతుదారులేనని తేలినట్లుగా పోలీసులే చెబుతున్నారు. దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?
Comments
Please login to add a commentAdd a comment