సంచలనం
దారిదోపిడీ హత్య కేసులలో ముగ్గురికి ఉరిశిక్ష
గుంటూరు లీగల్, న్యూస్‌లైన్
దూర ప్రాంత ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడి ఎదురు తిరిగితే హత్యచేసే నరహంతక ముఠాలోని ముగ్గురికి ఉరి శిక్ష, జరిమానా విధిస్తూ మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.శ్రీనివాస్ తీర్పు చెప్పారు.(ప్రధాన వార్త మెయిన్‌లో) ఉరిశిక్షపడిన మురళీకృష్ణ, శివరామకృష్ణ, అమర నాగేశ్వరరావులు ముగ్గరు దాచేపల్లి మండలానికి చెందినవారు కావడంతో ఈ కేసు జిల్లాలో సంచలనమైంది.
దాచేపల్లి మండలానికి చెందిన తొమ్మిది మంది ఓ ముఠాగా ఏర్పడి పలు విధాలుగా దోపిడీలు చేయడమే కాకుండా పరిస్థితిని బట్టి హత్యలు చేస్తుండేవారు. ఉరిశిక్ష పడిన యక్కలూరి శివకృష్ణ (యోగి),అక్కినపల్లి మురళీకృష్ణ(మురళి), ఇరికేపల్లికి చెందిన పప్పుల అమర నాగేశ్వరరావు(అమర్)లతోపాటు మరో ఆరుగురు జల్సాలకు అలవాటుపడి పలు నేరాలకు పాల్పడ్డారు. దారిదోపిడీలు చేస్తూ ఎదురుతిరిగిన వారిని హత్య చేసేవారు. ఈ క్రమంలో 2011 ఫిబ్రవరిలో కృష్ణా జిల్లా నందిగామకు చెందిన, ఎన్‌ఎస్పీ కెనాల్స్ ఇరిగేషన్ శాఖలో డెప్యూటి ఇంజనీరు దారావత్ బద్యానాయక్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో తీగ లాగిన పోలీసులకు ఈ బృందం ఘాతుకాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ వెళ్లేందుకు విజయవాడ బస్టాండ్‌లో వేచివున్న బద్యానాయక్‌ను తన కారులో తీసుకెళతామని నమ్మించారు. కారును దారి మళ్ళించిన నిందితులు అతని వద్దఉన్న గొలుసు, ఉంగరం, వాచీ, ఎటిఎం కార్డులను లాక్కొని హత్యచేసి ఎన్‌ఎస్సీ కెనాల్‌లో వేసి ఉడాయించారు.
ఇంజినీరు భార్య తన భర్త కనిపించడం లేదని చేసిన ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ చేపట్టి ఈ నరహంతక ముఠాను పట్టుకొన్నారు. వీరు ముగ్గురు మాత్రమే కాకుండా మిగిలిన ఆరుగురుపై గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కర్నూలు, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో నమోద యిన కేసులన్నింటినీ గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానంలో విచారిం చాల్సిం దిగా రాష్ట్రహైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు 2011 డిసెంబర్ 2వ తేదీన ప్రభుత్వం జీవో నంబర్ 138 ప్రకారం కేసు విచారణ గుంటూరు కోర్టుకు బదిలీ ఉత్తర్వులిచ్చింది.
ప్రాసిక్యూషన్ వారి నేరాలను రుజువు చేయడంతో న్యాయమూర్తి శ్రీనివాస్, నేరస్తులు ముగ్గురికి ఉరిశిక్ష, 12వేల రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు. ఈ ముగ్గురు రెండేళ్ళ కిందట చేసిన దారిదోపిడీ కేసులో గత జనవరిలో ఇదే న్యాయస్థానం ఒక్కొక్కరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఏపీపీ కాసు వెంకటరెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించగా సీసీఎస్ డీఎస్పీ టి. రవీంద్రబాబు, సీసీఎస్ అర్బన్ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సాక్షుల విచారణ జరిగింది.
ఇది రెండవ ఉరిశిక్ష కేసు...
జిల్లా కోర్టు పరిధిలో దాదాపు ఇరవై సంవత్సరాల కిందట చిలకలూరిపేట బస్సు దహనం కేసులో ఉరి శిక్ష పడిన నేరస్తులు గంటెల విజయవర్ధన్, చలపతిరావుల అనంతరం ఉరిశిక్ష పడిన నేరస్తులు ఈ ముగ్గురే కావడం విశేషం.
జల్సాలకు అలవాటు పడి...
దాచేపల్లి, న్యూస్‌లైన్: దాచేపల్లి అచ్చాలగడ్డకు చెందిన అక్కినపల్లి వెంకటేశ్వర్లు, కోటేశ్వరి దంపతుల పెద్ద కుమారుడైన మురళీకృష్ణ జల్సాలకు అలవాటు పడ్డాడు. రెండవ తరగతి వరకు చదువుకున్న మురళీకృష్ణ ఆరేళ్లుగా కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చెడువ్యసనాలకు అలవాటు పడిన మురళీకృష్ణను కొంతకాలంగా తండ్రి ఇంటికి రానివ్వడం లేదు. శిక్ష తగ్గించాలని కోరుతూ పై కోర్టులను ఆశ్రయించనున్నట్టు మురళీకృష్ణ తండ్రి వెంకటేశ్వర్లు చెప్పారు.
పై కోర్టును ఆశ్రయిస్తాం...
నడికుడి పంచాయతీ యిరికేపల్లికి చెందిన పప్పుల అమర నాగేశ్వరావుకు ఉరిశిక్ష పడడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. పప్పుల చంద్రయ్య, నాగరత్నం దంపతులకు కుమారుడైన అమర నాగేశ్వరావుకు ఓ సోదరి, తల్లి వున్నారు. ముగ్గుమిల్లులో పనిచేసే తండ్రి చంద్రయ్య ఐదు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. న్యాయం కోసం పై కోర్టులను ఆశ్రయిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.