రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో మాట్లాడుతున్న కేవీకే ప్రధాన శాస్త్రవేత్త మురళీకృష్ణ
అనంతపురం అగ్రికల్చర్: రైతును రాజును చేయాలన్న సీఎం వైఎస్ జగన్ ఆశయం నుంచి పుట్టిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు) నిజంగా రైతుల పాలిట దేవాలయాలుగా మారతాయని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ప్రధాన శాస్త్రవేత్త, కీటకశాస్త్ర విభాగం నిపుణుడు డాక్టర్ టి.మురళీకృష్ణ అన్నారు. వీటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జిల్లాలోని రామగిరి, మరూరు, రాప్తాడు, నాగిరెడ్డిపల్లి ఆర్‌బీకేలను శుక్రవారం ఆయన సందర్శించారు. అనంతరం ‘సాక్షి’తో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
ఆర్‌బీకే వ్యవస్థ నిజంగా అద్భుతం
► తొలుత రామగిరి ఆర్‌బీకేకు వెళ్లాను. అధికారులతో పాటు కొందరు రైతులు ఉన్నారు. అక్కడి వసతులు పరిశీలించాను. కియోస్క్ పరికరం, టీవీ, ఎల్‌ఈడీ సెట్, కుర్చీలు, టేబుళ్లు, ర్యాక్‌లు అందులో వివిధ కంపెనీలకు చెందిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ప్యాకెట్లు ఉన్నాయి. చదువుకునేందుకు వ్యవసాయ పుస్తకాలు కూడా ఉన్నాయి. ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగపడే కషాయాల తయారీ మిషన్, కుక్కర్ వంటివి ఉన్నాయి. పశువులకు సంబంధించిన మందులు కూడా ఉన్నాయి.
► తర్వాత డిజిటల్ కియోస్క్ పనితీరు పరిశీలించాను. రిజిష్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ రైతుకు ఎప్పుడు ఏమి కావాలన్నా ఇందులో ఆర్డర్ ఇచ్చి.. పక్కనున్న సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్‌కు డబ్బు కడితే... 48 గంటల్లో ధర్మవరంలో ఉన్న ఆర్‌బీకే హబ్ ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితరాలు అందుతాయి.
► డబ్బు కట్టిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన సరుకు ఎక్కడుంది, ఎప్పుడొస్తుందనే విషయం కూడా మొబైల్ ట్రాకింగ్ ద్వారా చూసుకోవచ్చు.
గ్రామ స్థాయిలో రైతులకు మంచి వేదిక
► రాప్తాడు మండలం మరూరు ఆర్‌బీకేలో నలుగురైదుగురు రైతులున్నారు. వసతులు పరిశీలిస్తుండగానే కొందరు ఉన్నతాధికారులతో పాటు మరో 20, 30 మంది రైతులు రావడంతో అక్కడ సందడిగా మారింది. ఆర్‌బీకేల గురించి అడగ్గానే రైతులు చాలా అవగాహన ఉన్నట్లు చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.
పురుగు మందులు వెంటనే ఇవ్వాలి..
► రాప్తాడు ఆర్‌బీకే వద్దకు వెళ్లేసరికి ఏఈవోలు, వీఏఏలు, వీహెచ్‌ఏలు, రైతులతో కిటకిటలాడుతోంది. పురుగు మందుల సరఫరా ఆలస్యం అయితే పంట దెబ్బతింటుందని రైతులు విన్నవించారు. రైతులకు క్రెడిట్ కార్డు వంటి సదుపాయం కల్పిస్తే బావుంటుందని మరికొందరు కోరారు.
రైతు విజ్ఞాన కేంద్రాలే..
► అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలోని నాగిరెడ్డిపల్లి ఆర్‌బీకేను మధ్యాహ్నం 2 గంటలకు సందర్శించాను. ఆ సమయంలో కూడా గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, చౌడప్ప మరికొందరు రైతులు తమ పేర్లను కియోస్క్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, ఉద్యాన, మత్స్య, మార్కెటింగ్ తదితర అనుబంధ శాఖలకు సంబంధించి అన్ని రకాల సేవలూ ఇక్కడ ఉంటాయన్నారు.
► మరూరు, నాగిరెడ్డిపల్లి ఆర్‌బీకేల వద్ద కూడా రైతుల సందడి కనిపించింది. ఈ–కర్షక్, డీ–కృషి, సీఎం యాప్, ధరల స్థిరీకరణ నిధి, సీహెచ్‌సీ సదుపాయం, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ 155251 అందుబాటులో ఉండటం విశేషం.
► భవిష్యత్తులో ఆర్‌బీకేలకు అనుబంధంగా శీతల గిడ్డంగులు, గోదాములు, ప్రాసెసింగ్, ప్యాకింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతుల తల రాతలే మారిపోతాయనడంలో సందేహం లేదు.
ఆర్‌బీకేలతో కష్టాలు తప్పినట్లే
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఇక కష్టాలు తప్పినట్లే. భూములు దుక్కి చేసి పంట విత్తుకునే నాటి నుంచి అమ్మకం వరకు అడుగడుగునా అండ గా ఉండే అవకాశం ఉన్నందున రైతులకు సమస్యలు ఉండవు.
– ముత్యాలునాయక్, రామగిరి
నాణ్యమైన వేరుశనగ ఇచ్చారు
ఈసారి ముందుగానే నాణ్యమైన వేరుశనగ ఇవ్వడంతో రైతు భరోసా కేంద్రాల ద్వారా మున్ముందు మరిన్ని సేవలు అందుతాయని భావిస్తున్నాం. వ్యవసాయ, ఉద్యాన పంటలకు కూడా ఇకపై గిట్టుబాటు ధరలు వస్తాయి. . ఆర్‌బీకేల ద్వారా అన్నీ మా వద్దకే వచ్చినట్లుంది.
– రామచంద్రారెడ్డి, కొండారెడ్డి, మరూరు
Comments
Please login to add a commentAdd a comment