సాక్షి, హైదరాబాద్ : తండ్రి ఎన్‌టీ రామారావు చైతన్య రథ సారథిగా టీడీపీ శ్రేణులతో పార్టీ ఆవిర్భావం నుంచి సన్నిహిత సంబంధాలు కలిగిన నందమూరి హరికృష్ణ రాజకీయాల్లోనూ తనదైన శైలిలో రాణించారు. ఆగస్టు సంక్షోభం నేపథ్యంలో చంద్రబాబు పార్టీ పగ్గాలను, సీఎం పీఠాన్ని అధిరోహించడాన్ని వ్యతిరేకిస్తూ హరికృష్ణ అన్నా టీడీపీని స్ధాపించారు. అనంతర పరిణామాలతో తిరిగి చంద్రబాబు గూటికి చేరిన హరికృష్ణ 1995లో బాబు క్యాబినెట్‌లో రవాణా మంత్రిగా వ్యవహరించారు.
2008లో రాజ్యసభకు ఎన్నికైన హరికృష్ణ రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ 2013 ఆగస్ట్ 4న రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి తన రాజీనామాను పట్టుపట్టి మరీ ఆయన ఆమోదింపచేసుకున్నారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న హరికృష్ణ ముక్కుసూటిగా మాట్లాడటం, పలు సందర్భాల్లో పార్టీ అధినేత చంద్రబాబుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి.
పార్టీలో తనకు, తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్‌కు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని తరచూ అసంతృప్తి వ్యక్తం చేసేవారు. మహానాడులో పాల్గొనడం కన్నా, ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడమే తనకు ముఖ్యమని గతంలో హరికృష్ణ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment