సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగితే రోడ్ల మీదకు రాకుండా ఎక్కడ పడుకున్నారో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్ల మీదకు వస్తుంటే నేను ఇంట్లో కూచుంటానా అని అంటున్న చంద్రబాబు సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం వెయ్యిమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్నీ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ప్రజల కష్టాలు కష్టాలే కావా? తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజలు భాగం కాదా? అని నిలదీశారు. 2009 డిసెంబర్ 7న అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై తీర్మానం ప్రభుత్వం పెట్టకుంటే తాను పెడతానని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు, నీచ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే అని విమర్శించారు. ఎక్కువసార్లు మాటమార్చిన చరిత్ర కూడా ఆయనదేనని దుయ్యబట్టారు. అపోహలు, అనుమానాలతో ఆందోళనలు చేస్తుంటే ఇరు ప్రాంతాల వారినీ కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా మరింత గందరగోళం, అయోమయం సృష్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తే రాజనీతిజ్ఞుడు ఎలా అవుతారని వ్యాఖ్యానించారు.
వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణను అడ్డుకున్నట్టుగా చెప్పిన చంద్రబాబు మరోసారి అడ్డుకుంటా అని చెబుతున్నట్టుగానే ఉందన్నారు. సమైక్యాంధ్ర ధర్మపోరాటమని అంటే మరి తెలంగాణ ప్రజలది అన్యాయమైన, అధర్మమైన పోరాటమని చంద్రబాబు చెప్పదలచుకున్నారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. వన్నారు. తెలంగాణ విభజన తర్వాత తలెత్తే సమస్యలేమిటో నిర్దిష్టంగా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని హరీష్‌రావు సూచించారు.
సకల జనుల సమ్మె కాలంలో ఎక్కడ పడుకున్నావు బాబూ?: హరీష్‌రావు
Published Tue, Sep 3 2013 3:38 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement