ప్లాస్టిక్ సర్జన్ల అవసరం పెరిగిందని, ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, పుట్టుకతో గానీ వచ్చిన వికృత ఆకారాన్ని సరైన ఆకృతిలోకి తీసుకురావడానికి ఈ సర్జరీలు అవసరమని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు.
ఎన్జీవోస్ కాలనీ, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ సర్జన్ల అవసరం పెరిగింద ని, ప్రమాదాలు జరిగినప్పుడు గానీ, పుట్టుకతో గానీ వచ్చిన వికృత ఆకారాన్ని సరైన ఆకృతిలోకి తీసుకురావడానికి ఈ సర్జరీలు అవసరమని ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. రెండు రోజుల పాటు జరుగనున్న ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ 11వ వార్షికోత్సవ సమావేశాలు శనివారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో ప్రారంభమయ్యాయి.
ఈ సమావేశాలను డాక్టర్ రవీందర్‌రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టిక్ సర్జరీ అంటే అందం కోసం అని అనుకుంటారని, ఈ అపోహల నుంచి బయటపడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీ సుకొచ్చిందని, ఆస్పత్రులు అనవసర పరీక్షలు చేయిం చినా, రోగులను మోసం చేసినా ఈ చట్టం ద్వారా ఆ ఆసుపత్రులను పరిశీ లించి చర్యకు ప్రభుత్వానికి నివేదిక పంపే అవకాశాన్ని మెడికల్ కౌన్సిల్‌కు కల్పించిందన్నారు. అల్లోపతి మందులను ఆర్‌ఎంపీలు రాస్తే వారిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.
ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి మాట్లాడుతూ ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఉన్నా సేవలందించేందకు ప్లాస్టిక్ సర్జన్ లేకపోవడంతో ఆ విభాగం వృథాగా ఉందన్నారు. ప్లాస్టిక్ సర్జరీ అవసరమైతే ప్రైవేట్ డాక్టర్లకు, హైదరాబాద్‌కు పంపుతున్నారన్నారు. దీంతో పేద ప్రజలపై భారం పడుతుందన్నారు. ప్రభుత్వ విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ప్లాస్టిక్ సర్జన్స్‌కు ఇచ్చే వేతనం పెంచైనా ఇక్కడ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మోహనకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు, అతిపెద్ద ఆస్పత్రులున్నాయని, ఈ ప్రాంతంలో ప్లాస్టిక్ సర్జరీపై అవగాహన కల్పించేందుకు ఇక్కడ రాష్ట్ర సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ ఇక్కడ ప్లాస్టిక్ సర్జన్ల సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సమావేశం లో సమావేశ ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ వెంకటరాఘవరెడ్డి, కార్యదర్శి డాక్టర్ హ నుమంతరావు, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ విష్ణుమూర్తి పాల్గొన్నారు.