విద్యార్థిని కొట్టి చంపిన ప్రధానోపాధ్యాయుడు
ప్రధానోపాధ్యాయుడికి.. అదే స్కూల్లో పనిచేసే మరో టీచర్కు వివాహేతర సంబంధాన్ని చూశాడని.. ఓ ఐదోతరగతి విద్యార్థిని కొట్టి చంపారు. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లా కావలిలో ఐదు రోజుల క్రితం జరిగింది. అనుమానాస్పద స్థితిలో చిన్నారి సాయికృష్ణ మృతిచెందినట్లు తొలుత భావించినా, పోలీసు విచారణలో అసలు వివరాలు బయటపడ్డాయి. కావలి శ్రీవిద్యానికేతన్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు అయ్యన్నకు, అదే స్కూల్లో పనిచేసే టీచర్ కౌసల్యకు కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. వారిద్దరూ ఓ గదిలో ఉండగా సాయికృష్ణ చూశాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా విద్యార్థిని భయపెట్టాలని అయ్యన్నకు కౌసల్య సూచించింది. దీంతో అయ్యన్న పక్కనే ఉన్న వసతిగృహంలోకి వెంకటసాయికృష్ణను పిలిపించి భయపెట్టేందుకు చెంపపై బలంగా కొట్టాడు. పక్కనే ఉన్న కిచెన్ స్లాబుపై పడటంతో విద్యార్థి తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆందోళనకు గురైన అయ్యన్న అనారోగ్యంతో సాయికృష్ణ మృతి చెందాడంటూ ఆస్పత్రికి తరలించి నాటకాలాడాడు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి రావడంతో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు.