తలసీమియా వ్యాధిగ్రస్తులకు
కర్నూలు(హాస్పిటల్) :
తలసీమియా వ్యాధికి గురైన చిన్నారులకు రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధిలో ఉచితంగా రక్తం అందిస్తున్నట్లు సొసైటీ చైర్మన్ శ్రీనివాసులు చెప్పారు.
బుధవారం రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడారు. తాము నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా రెడ్‌క్రాస్ తలసీమియా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు రక్తదాతల సంఘం, స్వచ్ఛంద సంస్థలు, కళాశాలలు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత సహకరించాలని కోరారు.
ఈ వ్యాధికి గురైన ప్రతి ఒక్కరికి నెలకు రెండు ప్యాకెట్ల రక్తం ఎక్కించాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మానవతా దృష్టితో రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. ఇప్పటిదాకా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా 99 మంది చిన్నారులకు రక్తదానం చేశామని, బుధ వారం ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన అనిల్ అనే చిన్నారి 100వ తలసీమియా వ్యాధి గ్రస్తునిగా నమోదయ్యాడని చెప్పారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.