అనంతపురం : చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే వక్రబుద్ధితో ప్రవర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల వికృతచేష్టలకు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్‌లో సోమవారం ఉపాధ్యాయుడి వెకిలిచేష్టలు మరువాక ముందే తాజాగా అనంతపురం జిల్లాలో మరో ప్రధానోపాధ్యాయుడు అసభ్యకర ప్రవర్తన వెలుగులోకి వచ్చింది.
పాఠశాలలోనే మద్యం తాగటంతోపాటు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ప్రధానోపాధ్యాయుడు తమకొద్దంటూ గార్లదిన్నె మండలం యర్రగుంట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్న విజయభాస్కర్ చేష్టలతో విద్యార్థులు బయటపడుతున్నారు. ఐదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో విద్యార్థులను యోగా పేరిట కళ్లు మూసుకోమని మద్యం తాగి..బాటిల్‌ను బయటకు విసిరేసేవాడు.
అలాగే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. ఇతని చేష్టలకు విసుగు చెందిన తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు తాళం వేశారు. హెచ్ ప్రవర్తనపై ఎంఈఓ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పాఠశాలకు చేరుకున్నారు. విజయభాస్కర్‌పై రాతపూర్వకంగా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఎంఈవో స్పందిస్తూ ఆయన్ను డీఈవోకు సరెండర్ చేస్తామని చెప్పారు.