కొండ నిండింది
- తిరుమలలో పోటెత్తిన భక్తులు
- సాయంత్రం 5.30 గంటలకే కాలిబాట క్యూ మూసివేత
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు 66,371 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రికి ఈ సంఖ్య 95 వేలు దాటనుంది. సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 14 గంటలు, కాలిబాట భక్తులకు 7 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభించనుంది. పెరిగిన రద్దీ వల్ల టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు క్యూలను పర్యవేక్షించారు. ఫలితంగా అన్ని క్యూలు త్వరగా కదిలి, సామాన్య భక్తులకు త్వరగా శ్రీవారి దర్శనం లభించింది. వేకువజాము ప్రొటోకాల్ వీఐపీలకు గంటలోనే దర్శనం పూర్తి చేశారు. పెరిగిన రద్దీ వల్ల కాలిబాట భక్తుల క్యూ సాయంత్రం 5.30 గంటలకు మూసివేశారు. శనివారం రికార్డు స్థాయిలో 95,113 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 68,364 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
ఆరుబయటే నిద్ర
భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గదులకు కొరత ఏర్పడింది. తిరుమలలో ఉండే సుమారు 6,800 గదులు కేటాయించినప్పటికీ అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చారు. శ్రీవారి ఆలయం, కల్యాణకట్ట, బస్టాండ్, సత్రాల వద్ద ఆరు బయటే భక్తులు నిద్రించారు. ఆదివారం లెక్కించిన హుండీ కానుకలు రూ. 2.40 కోట్లు లభించాయి.
ఆలయం వద్ద 20 నిమిషాలు అంధకారం
తిరుమలలో ఆలయం వద్ద ఆదివారం రాత్రి 7.10 గంటలకు హఠాత్తుగా విద్యుత్ సరఫరా అగిపోయింది. ఆ సమయంలో ఎక్కడి భక్తులు అక్కడే నిలిచిపోయారు. నాలుగు నిమిషాల తర్వాత జనరేటర్ సాయంతో ఆలయం లోపల మాత్రం బల్బులు వెలిగించారు. ఆలయ పరిసర ప్రాంతాలతో పాటు నాలుగు మాడ వీధుల్లో 20 నిమిషాల తరువాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఈ సమయంలో భక్తులు ఇబ్బందిపడ్డారు. చిన్నపిల్లల ఏడ్పులు వినిపించాయి.