
ఇక ఏరులై పారనున్న మద్యం
ఏపీలో భారీగా అదనపు ఉత్పత్తి
నాలుగు డిస్టిల్లరీ కంపెనీలకు
ఉత్పత్తి సామర్థ్యం పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కేవలం నాలుగు డిస్టిల్లరీ కంపెనీలకు మాత్రమే అదనపు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అనుమతిస్తూ సీఎం చంద్రబాబు సంబంధిత ఫైలుపై సోమవారం ఆమోదముద్ర వేశారు. ఇంకా పలు డిస్టిల్లరీ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే అనుమతి ఇవ్వడం గమనార్హం.
ప్రస్తుతం రాష్ట్రంలో 14 మద్యం తయారీ కంపెనీలుండగా తద్వారా ఏడాదికి 1221.58 లక్షల ప్రూఫ్ లీటర్ల మద్యం ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు నాలుగు డిస్టిల్లరీలకు అదనంగా ఏకంగా ఏడాదిలో 8.73 కోట్ల ప్రూఫ్ లీటర్ల మద్యం ఉత్పత్తికి ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు. ఈ నాలుగు కంపెనీలలో నెలలో అదనపు ఉత్పత్తి 11,22,684 లక్షల కేసులవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో మద్యం అదనపు ఉత్పత్తికి అనుమతించారంటే ఇక రాష్ట్రంలో మద్యం కొరతనేది లేకుండా చేయడానికేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.