తాడేపల్లి, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు.
‘‘ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీజయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు?. మహిళల పసుపు, కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామంటున్నారు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడమని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా?.
షాపింగ్ కాంప్లెక్స్ లాగా లిక్కర్ కాంప్లెక్సులు తేవటం ఏంటి?. జగన్ హయాంలో మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అందుకే ఎలాంటి సమస్యా ఆనాడు రాలేదు. ఇప్పుడు తన మనుషులకు ఆదాయం సమకూర్చేందుకు చంద్రబాబు మద్యం షాపులు ఇస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు. తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వటం దారుణం. ఈ మద్యం పాలసీని వైఎస్సార్‌సీపీ వ్యతిరేకిస్తోంది. వీటన్నిటిపై మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం’ అని అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment