ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు  | Heavy Floods At Prakasam Barrage | Sakshi
Sakshi News home page

ఉగ్రవేణి.. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు 

Published Fri, Aug 16 2019 8:42 AM | Last Updated on Fri, Aug 16 2019 3:47 PM

Heavy Floods At Prakasam Barrage - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మూడో రోజైన గురువారం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీ నుంచి 4,51,686 క్యూసెక్కుల (39.03 టీఎంసీలు)ను సముద్రంలోకి వదులుతున్నారు. శుక్రవారం ఉదయానికి కూడా ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారటంతో లంక గ్రామాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. లంక గ్రామాలను ఏ క్షణంలో అయినా వరద ముంచెత్తే అవకాశం ఉందని.. వృద్ధులు తక్షణమే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని మైక్‌లో ప్రచారం చేశారు. విజయవాడ ప్రాంతం నుంచి సుమారు 2 వేల కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో ప్రస్తుతానికి 791 హెక్టార్లలో అరటి, పసుపు, మిర్చి, బొప్పాయి, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేశారు.

కరకట్ట వద్ద పెరిగిన ముంపు 
కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న ఇళ్లల్లో వరద ముంపు మరింత పెరిగింది. ఇక్కడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్న విషయం విదితమే. ఆ భవనాన్ని కూడా వరద చుట్టుముట్టింది. అక్కడి భవనాల్లో ఎవరూ ఉండవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కొనసాగుతున్న హై అలర్ట్‌ 
కృష్ణా పరిధిలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఎగువన భారీ వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆల్మట్టి నుంచి దిగువకు 5.20 లక్షల క్యూసెక్కుల(44.93 టీఎంసీలు)ను, నారాయణపూర్‌ నుంచి 5.27 లక్షల క్యూసెక్కుల(45.56 టీఎంసీలు)ను వదులుతున్నారు. ఉజ్జయిని జలాశయం నుంచి 5,950 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 7.05 లక్షల క్యూసెక్కుల(60.92 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. తుంగభద్రలో ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 8.62 లక్షల క్యూసెక్కుల (74.55 టీఎంసీలు) ప్రవాహం చేరుతుండగా, దిగువకు 8.61 లక్షల క్యూసెక్కులు (74.48 టీఎంసీలు) విడుదల చేస్తున్నారు. సాగర్‌లోకి 8.78 లక్షల క్యూసెక్కులు (75.95 టీఎంసీలు) చేరుతుండగా.. నీటి నిల్వ 303.95 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 6.44 లక్షల క్యూసెక్కులు (55.71 టీఎంసీలు) వస్తుండగా.. అదే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. 

కృష్ణా వరదలపై సీఎం సమీక్ష
కృష్ణా నది వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. అమెరికా పర్యటనకు వెళ్లే ముందు.. వివిధ రిజర్వాయర్ల నుంచి విడుదల అవుతున్న నీటి వివరాలను తెలుసుకున్నారు. దాదాపు 7లక్షల క్యూసెక్కులకుపైగా నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతుందని అధికారులు చెప్పడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని అదేశించారు. వరద సహాయక చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement