చైనా తయారీ సంస్థల కోసం
2 వేల ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్
కాకినాడ సిటీ : కాకినాడ స్పెషల్ ఎకనమిక్ జోన్ (కేఎస్‌ఈజెడ్)లో రానున్న ఐదేళ్లలో 2.5 నుంచి 3.5 బిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. కాకినాడ సెజ్‌లో చైనాలోని తయారీ కంపెనీల కోసం 2వేల ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు చైనాకు చెందిన గ్వుయ్‌జూప్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ (జీఐఐసీ)తో జీఎంఆర్ కాకినాడ సెజ్ సోమవారం ఒప్పందం చేసుకుంది. చైనాకు చెందిన మూడు ప్రముఖ తయారీ సంస్థల కన్సార్టియం అయిన జీఐఐసీ, కేఎస్‌ఈజెడ్‌లో నాణ్యమైన చైనా పరికరాల తయారీ సంస్థలను స్థాపించేందుకు ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, జీఎంఆర్ ఇన్‌ఫ్రా బిజినెస్ చైర్మన్ బి.వి.ఎస్.రాప్, జీఐఐసీ అధికారుల సమక్షంలో కాకినాడ సెజ్ అధ్యక్షుడు చల్లా ప్రసన్న ఈ మేరకు అవగాహన ఒప్పందాలపై సోమవారం చైనాలోని షాంఘైలో సంతకాలు చేశారు.
ఆ వివరాలను జీఎంఆర్ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. చైనాకు చెందిన విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, విండ్, సోలార్ విద్యుత్, స్మార్ట్ టెక్నాలజీ తదితర సంస్థలు కాకినాడ సెజ్‌లో యూనిట్లు స్థాపించేందుకు ఆసక్తి చూపుతున్నాయని వారు తెలిపారు. ఈ సెజ్‌లో ఏర్పాటు చేసే పరిశ్రమలకు కాకినాడ సెజ్ అధునాతన మౌలిక సౌకర్యాలు కల్పిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పథకంలో లభించే ప్రయోజనాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయని చైర్మన్ రాప్ తెలిపారు. ఇందుకోసం జీఐఐసీ 500 మిలియన్ల యూఎస్ డాలర్లను ఖర్చుచేయనుందని చెప్పారు.
కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడులు
Published Tue, May 19 2015 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement