విశాఖ, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలు అతలాకుతలం
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. సీమాంధ్ర జిల్లాలన్నింటిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ముఖ్యంగా విశాఖపట్నం, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలపై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. 24 గంటలుగా కురుస్తున్న వర్షాలతో ఈ జిల్లాలలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పంటలు నీట మునగడంతో భారీ నష్టం సభవించింది. తూర్పు, పశ్చిమగోదావని, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
విశాఖ జిల్లాలోని చోడవరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దేరు, కోనాం రిజర్వాయర్ల నుంచి మూడు వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చోడవరం పట్టణంలో పూర్ణ థియేటర్ దగ్గర రెండు కాలనీల్లో ఇళ్లు నీట మునిగాయి. అటు పెందుర్తి మండలంలో చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. మండలంలోని మూడు గ్రామాలు నీట మునగడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. పద్మనాభ మండలంలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండలంలో గోస్తా నది తీరంలో ఉన్న సుమారు 800 ఎకరాల వరి పంట నేలకొరిగింది. కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడటంతో పంటలు నీట మునిగాయి. పంట చేతికందే సమయంలో ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం జిల్లా గిద్దలూరులో వరద నీరు బీభత్సం సృష్టిస్తోంది. సగిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పట్టణంలోని కొన్ని కాలనీల్లో నడుములోతు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇళ్లు కూడా సగం వరకూ మునగడంతో ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ సమన్వయకర్త అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు సహాయమందించారు. తాళ్ల సాయంతో బాధితులను అక్కడి నుంచి తరలించారు. కొంతమందిని పక్కనే ఉన్న భవనాలపైకి ఎక్కించారు. బాధితులకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భోజన సదుపాయాలు కల్పించారు. తుపాను కారణంగా రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కందుకూరు పట్టణం మొత్తం నీట మునిగింది. డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో కొన్ని కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. దీనికి తోడు మున్సిపల్ సిబ్బంది సమ్మెలో ఉండటంతో అత్యవసర సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి వచ్చిన నీటిని వెంటనే తొలగించాలని వాళ్లు కోరుతున్నారు.
వైఎస్సార్ జిల్లాలో అకాల వర్షాల కారణంగా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. పొద్దుటూరు, రాజుపాలెం మండలాల్లో ఎక్కువగా సాగైన వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు వైఎస్సార్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా కడప నగరంలోని శివారు ప్రాంతాల ప్రజలు ఈ వర్షం కారణంగా ఏకంగా ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కడపలోని జయనగర్, ఎన్జీవో కాలనీ, అక్కాయపల్లి లాంటి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఇలాగే జరుగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు చేరడంతో చేసేది లేక ఈ కాలనీల వాసులంతా ఇళ్లకు తాళాలు వేసి బంధుల దగ్గరికి వెళ్లిపోయారు. ప్రతిసారీ ఇలాగే జరుగుతున్నా అధికారులు మాత్రం తమను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కడప నగరంలోని చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ కూడా నీటిలో చిక్కుకుంది. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి నీళ్లు చేరడంతో ప్రజలు బయటికి కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని కడప వాసులు అంటున్నారు. డ్రైనేజీ కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా సరైన ప్రణాళిక లేని కారణంగా ఇలాంటి దుస్థితి తలెత్తుతోందని కడపవాసులు వాపోతున్నారు.