చోడవరం రూరల్/చోడవరం టౌన్: వర్షం,ఈదురు గాలులు జిల్లాలో శనివారం బీభత్సం సృష్టించాయి. ఏజెన్సీతోపాటు మైదానంలోని పలు ప్రాంతాల్లోనూ గంటల తరబడి దపదపాలుగా వాన పడింది. దానికి భారీ గాలులు తోడవ్వడంతో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. చెట్ల కొమ్మలు తీగలపై పడి విద్యుత్ సరఫరాకు గంటల తరబడి అంతరాయం ఏర్పడింది. రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. చోడవరం ప్రాంతంలో ప్రభావం పెద్ద ఎత్తున కనిపించింది. పిడుగుపడి డుంబ్రిగుడ మండలం అరకు గ్రామానికి చెందిన గొల్లోరి బిమల(55) అక్కడికక్కడే మృతి చెందింది. చోడవరం మండలం వెంకన్నపాలెం సమీపంలో రోడ్డుకడ్డంగా చెట్లు విరిగి పడి సుమారు గంటపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. గోవాడ సుగర్ ప్యాక్టరీ సమీపంలోనూ చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చోడవరం-పిఎస్‌పేట రోడ్డులో విద్యుత్ స్తంభాలు నాలుగు చోట్ల నేల కూలాయి. చోడవరం పట్టణంతోపాటు పరిసర గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. తొలుత వడగళ్లు పడ్డాయి. అనంతరం భారీ గాలులతో గోవాడ,అంభేరుపురం, వెంకన్నపాలెం, గజపతినగరంలలో వర్షం కురిసింది.
ఇంటిపై కూలిన భారీ వృక్షం
గొలుగొండ : మండలంలోని ఆరిలోవ, యర్రవరం, చీడిగుమ్మల ప్రాంతాల్లో భారీ వర్షం కురి సింది. దానికి ఈదురు గాలులు తోడవ్వడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రాజు బాబుల గుడివద్ద పూరింటిపై పెద్ద చెట్టు పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. యర్రవరం వద్ద చెట్లుపడటంతో 33కేవీ సబ్-స్టేషన్ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. గొలుగొండకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆరిలోవ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం వల్ల ఊర చెరువుల్లోకి నీరు చేరింది. ఈదురు గాలుల వల్ల మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్షం సరుగుడు, చెరకుతో పాటు ఇతర పంటలకు అనుకూలమని రైతులు అంటున్నారు.
పిడుగుపడి మహిళ మృతి
డుంబ్రిగుడ: భారీ వర్షానికి మండలంలో పిడుగుపడి గిరిజన మహిళ మృతి చెందింది. అరకు గ్రామానికి చెందిన గొల్లోరి బిమల(55) కట్టెల కోసం అడవికి వెళ్లింది. తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో ఆమె ప్రమాదానికి గురయి అక్కడిక్కడే చనిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ఈ వర్షం తొలకరి దుక్కులకు ఉపయోగపడుతుందని రైతులు అంటున్నారు.
ఇళ్లల్లోకి నీరు
అరకు రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయలో శనివారం కుండపోత వర్షం కురిసింది. సుమారు గంటసేపు కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. పంటపొలాలు నీటమునిగాయి. కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీరు రోడ్డుపై పొంగి ప్రవహించింది. మసీదు కాలనీ, కంఠబౌంసుగుడ, కొండవీధుల్లో ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మన్యంలో కుండపోత
అరకులోయ/పాడేరు : అరకులోయ, పాడేరు పరి సర ప్రాంతాల్లో శనివారం కుండపోతగా వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా పడింది. పెద్ద పెద్ద పిడుగుల శబ్దానికి ఈదురు గాలులు తోడవ్వడంతో గిరిజనులు భయాందోళనకు గురయ్యా రు. పంట పొలాలన్నీ నీటితో నిండిపోయాయి. ఎండ తీవ్రత నుంచి జనానికి కాస్త ఉపశమనం లభించింది. రోజు వర్షాలు కురుస్తుండటంతో మన్యంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.