సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల పొలాల్లో కోసిన వరి మెదళ్లు నీటిలో తేలియాడుతున్నాయి. మొక్కజొన్న కంకులు మురిగిపోతుండగా, ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి తడిసి ముద్దయిపోయింది. చివరి దశలో ఉన్న సోయాబీన్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. వర్షపు నీటితో తడిసిన పంట ఉత్పత్తులను చూసిన రైతులు గుండెలు బాదుకుంటున్నారు. కళ్లా లు, రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న, సోయాబీన్, వరి ధాన్యం నేలపాల య్యాయి. విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్‌లోకి తరలించిన పంట ఉత్పత్తులు తడిసిపోయినందున మద్దతు ధర లభించని పరిస్థితినెలకొని ఉంది.
ఇప్పటికే తేమ శాతం ఎక్కువగా ఉందన్న నెపంతో వరి ధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్‌కు వ్యవసాయ మార్కెట్లలో గిట్టుబాటు రావడం లేదు. వర్షానికి నానిపోయిన గింజలు నల్లబారిపోవడంతోపాటు మెత్తపడడం వల్ల మరింతగా తేమ శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సాకుతో వ్యాపారులు మరింత ధర తగ్గించే అవకాశాలున్నాయి. తడిసిన గింజలను ప్రభుత్వ రంగ సంస్థలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏటా ప్రకృతి వైపరీత్యాలు రైతును వెంటాడుతున్నాయి. గతేడాది ఇదే సమయంలో వర్షాలు రావడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈసారి ఖరీఫ్‌లో వర్షాలు బాగా పడడం వల్ల పంట దిగుబడులు పెరగవచ్చని గంపెడాశతో ఉన్న రైతును అకాల వర్షం పూర్తిగా దెబ్బతీసింది.
6,600 ఎకరాల పంట వర్షార్పణం
జిల్లాలో వర్షాలకు 6,600 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. బాన్సువాడ నియోజక వర్గంల్లో 800 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 1,700 ఎకరాల్లో వరి, మొక్కజొన్న, సోయాబీన్ పంటలు దెబ్బతినగా, ఇదే పరిస్థితి మిగితా ప్రాంతాల్లో కూడా నెలకొని ఉంది. కామారెడ్డి నియోజకవర్గంలో వేయి ఎకరాలు, జుక్కల్ నియోజక వర్గంలో 1,300 ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో 400 ఎకరాలు, బోధన్ నియోజక వర్గంలో 1,400 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మండలాల వారీగా పరిస్థితిని పరిశీలిస్తే బాన్సువాడ మండలంలో 150 ఎకరాలు, బీర్కూర్‌లో 200, వర్నిలో 200, కోటగిరిలో 200, లింగంపేటలో 500, నాగిరెడ్డిపేటలో 800, సదాశివనగర్‌లో 200, తాడ్వాయిలో 200, రెంజల్‌లో 400, ఎడపల్లిలో వేయి, జుక్కల్‌లో 300, నిజాంసాగర్‌లో 600, పిట్లంలో 300, మద్నూర్‌లో 100, సిరికొండలో 400 ఎకరాల్లో వివిధ పంటలు పూర్తిగా దెబ్బతిన్నట్లు రైతులు పేర్కొంటున్నారు.
పట్టింపులేని వ్యవసాయ శాఖ
జిల్లాలో వర్షాలతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పటికీ వ్యవసాయ శాఖలో కదలిక లేదు. వ్యవసాయ మార్కెట్లలో సౌకర్యా లు కల్పించడంలో మార్కెటింగ్ శాఖ పూర్తిగా విఫలమైంది. రైతుల నుంచి మార్కెట్ ఫీజును వసూలు చేస్తున్న అధికారులు, పాలకవర్గానికి దీనిని పట్టించుకోవడం లేదు. ఈ రెండు శాఖలు పట్టింపులేని విధంగా వ్యవహరిస్తున్న తీరుపై రైతులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు పంటనష్టం అంచనాపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లలేదు. పైగా జిల్లాలో ఎక్కడ కూడా పంటలకు నష్టం వాటిల్ల లేదని సెలవిస్తోంది. పంటపొలాలకు వచ్చిన వర్షపు నీటిని తొలగించడం ద్వారా పంటను రక్షించుకోవాలని, నష్టం నివారణ కోసం నేల కొరిగిన వరి మొక్కలను పైకి ఎత్తాలని సూచనలు చేసింది.
సగటు వర్షపాతం 18.2.మి.మీలు...
జిల్లాలో శుక్రవారం సగటు వర్షపాతం 18.2 మి.మీ నమోదయింది. 16 మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే 20 శాతం అధిక వర్షపాతం నమోదు కాగా, మరో 20 మండలాల్లో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా జుక్కల్ మండలంలో 54.6 మి.మీ, నవీపేటలో 54.3 మి.మీ, జక్రాన్‌పల్లి 48.4 మి.మీ, ఎడపల్లి 42.1 మి.మీల వర్షపాతం నమోదయ్యింది. మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ధర్పల్లిలో అతితక్కువ వర్షం పడింది. జిల్లాలో జలాశయాలు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి.