ఇక వానలే వానలు
సాక్షి, విశాఖపట్నం: రైతాంగానికి శుభవార్త. తెలంగాణ, ఏపీల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల్లో చురుకుదనం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఇందుకు దోహదపడనుంది. కొన్నాళ్లుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోంది. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది.
ఫలితంగా బుధవారానికి ద్రోణి బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారింది. దీంతో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఏపీలలో పుంజుకుంటున్నాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకూ విస్తరించనున్నాయి. ఈ ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం బుధవారం తెలిపింది.