కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం ముగ్గురిని కబళించింది. అత్యధికంగా కొత్తపల్లిలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొత్తపల్లితో పాటు, పగిడ్యాల, ఆత్మకూరు, గూడూరు, వెలుగోడు మండలాల్లో భారీ వర్షం పడటంతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. కుంటలు, చెక్‌డ్యామ్‌ల్లో నీరు చేరింది. కొత్తపల్లి మండలంలో బావాపురం-నందికుంట గ్రామాల మధ్యన సుద్దవాగు, లింగాపురం-శివపురం గ్రామాల మధ్యన ఉన్న పెద్దవాగు పొంగి పొర్లడంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కొత్తపల్లికి చెందిన గూడెం పెద్దసామన్న (42)కు బీపీ పెరగడం వల్ల ఆరోగ్యం విషమించడంతో ఆటోలో ఆసుపత్రికి తరలిస్తుండగా నందికుంట వద్ద వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్న సుద్దవాగును దాటలేకపోయారు. క్షణక్షణానికి వరద ప్రవాహం పెరగడంతో పెద్దసామన్న ఆటోలోనే మృతిచెందాడు. 108 వాహనం వచ్చినా అది కూడా వాగు దాటలేకపోయింది. కల్లూరు మండలం ఎ.గోకులపాడు వద్ద ఉన్న వక్కెరవాగులో లింగన్న(21) అనే యువకుడు కొట్టుకుపోయి మృతి చెందాడు.
ఇదే వాగులో కొద్ది నెలల క్రితమే ఇద్దరు విద్యార్థినులతో సహా ముగ్గురు మరణించారు. మళ్లీ ఇదే వాగులో ఒక యువకుడు మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. పాణ్యంలో మట్టి మిద్దె కూలిపోవడంతో 8వ తరగతి విద్యార్థిని లక్ష్మేశ్వరి మృతి చెందింది. గూడూరు మండలంలోని పెంచికలపాడు-గూడూరు మధ్య ఉన్న వాగు పొంగి పొర్లడంతో 500 ఎకరాల్లో ఉల్లి, పత్తి పంటలు నీటమునిగాయి. కొత్తపల్లి మండలంలో సుద్దవాగు, పెద్దవాగులు పొంగి పొర్లడం వల్ల వెయ్యి ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పగిడ్యాల మండలం ప్రాతకోట సమీపంలోని రాయల చెరువు పొంగడం వల్ల వర్షపు నీరు పంట పొలాలను ముంచెత్తింది.
జిల్లా మొత్తం మీద ఒకే రోజు 27.9 మి.మీ వర్షపాతం నమోదు అయింది. పగిడ్యాలలో 8.4 సెంటీమీటర్లు, ఆత్మకూరులో 7.5 సెంటీమీటర్లు, గూడూరులో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. తాజా వర్షాలతో జిల్లాలోని అన్ని మండలాల్లో పంటలు పూర్తిగా కోలుకుంటున్నాయి. పొలాల్లో నిలిచిన నీరును వెంటనే బయటికి పంపించే ఏర్పాట్లు చేసుకోవాలని లేకపోతే వేర్లు కుళ్లిపోయి పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని డాట్ సెంటర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ సరళమ్మ తెలిపారు.
జోరు వాన
Published Thu, Aug 28 2014 4:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:32 PM
Advertisement
Advertisement