అల్పపీడన ద్రోణి చురుగ్గా ఉన్న కారణంగా రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తమిళనాడుపై ఓ వైపు రుతుపవనాలు ప్రభావం చూపించడం, దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతుండడం వల్ల రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
బుధవారం రాత్రి వరకు కూడా ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందన్నారు. దీని కారణంగా రానున్న 24గంటల్లో సీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మరోవైపు విదర్భ, షోలాపూర్ మీదుగా మేఘాలు ఆవరించడం వల్ల తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయన్నారు. గురువారం సాయంత్రం లోపు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది.