జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారం నుంచి ప్రారంభమైన భక్తులరద్దీ సోమవారం కూడా కొనసాగింది.
శ్రీశైలం (కర్నూలు) : జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రావణ శుక్రవారం నుంచి ప్రారంభమైన భక్తులరద్దీ సోమవారం కూడా కొనసాగింది. మన రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర ప్రదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకున్నారు. రెండవ శ్రావణ సోమవారం దాదాపు 70 వేలకుపైగా భక్తులు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని ఉంటారని అధికారుల అంచనా. కాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈఓ సాగర్‌బాబు ఆలయ పూజావేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3.30గంటలకు మంగళవాయిద్యాలు, 4గంటలకు సుప్రభాతం, 5గంటలకు మహా మంగళహారతులు, 5.30గంటల నుంచి దర్శన ఆర్జితసేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకున్నారు.
కాగా శ్రావణమాసం సందర్భంగా భక్తులు పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలాచరించుకుని కృష్ణమ్మకు వాయనాలు అందజేసి నేరుగా స్వామివార్ల దర్శనార్థమై క్యూలో వేచి ఉండడంతో ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన క్యూలు కిటకిటలాడాయి. భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పించేందుకు ఉచిత, ప్రత్యేక, అతి శీఘ్ర దర్శన భక్తులకు స్వామివార్ల దూరదర్శనం ఏర్పాటు చేశారు. కేవలం అభిషేకాలను నిర్వహించుకునే సేవాకర్తలను మాత్రమే గర్భాలయంలోనికి అనుమతించారు. సోమవారం స్వామివార్ల దర్శనానంతరం భక్తులు సందర్శనీయ స్థలాలైన సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలదార-పంచధార, శిఖరేశ్వరం తదితరాలను దర్శించుకుని వెళ్లారు.