ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రజాదర్బార్‌లో సమూల మార్పులకు కలెక్టర్ విజయకుమార్ శ్రీకారం చుట్టారు. సమస్యలతో సతమతమవుతున్న వారు తమ సమస్యను అర్జీ రూపంలో అధికారులకు తెలియజేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ సమస్యను కాగితంపై రాయించేందుకు కలెక్టరేట్ వద్ద రైటర్లుగా చలామణవుతున్న వారిని ఆశ్రయిస్తున్నారు. ఒక్కో అర్జీకి 10 నుంచి 30 రూపాయల వరకు చెల్లిస్తున్నారు. అర్జీరాస్తున్న సమయంలో సంబంధిత వ్యక్తి సమస్యను తెలుసుకుంటున్న రైటర్.. ఆ అధికారి తనకు తెలుసని, అర్జీతో పనిలేకుండా ఆ పనిని తాను చేయిస్తానని వారిని నమ్మబలుకుతూ 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నాడు.
ఈ విషయం కూడా కలెక్టర్ దృష్టికి వచ్చింది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆవేదనతో ప్రజాదర్బార్‌కు వచ్చేవారికి అర్జీల రూపంలో అదనపు ఖర్చు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రజాదర్బార్‌లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందుకోసం రెండు శాఖలకు చెందిన పదిమంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ప్రజాదర్బార్‌కు వచ్చేవారు వీరిని వినియోగించుకునేందుకు వీలుగా ‘హెల్ప్ డెస్క్’ అనే బ్యానర్‌ను కూడా రాయించారు. ఎక్కువ మంది ఉపయోగించుకునే విధంగా హెల్ప్ డెస్క్‌ను రూపకల్పన చేశారు. అంతేగాకుండా సంబంధిత అర్జీదారుని సమస్యను స్పష్టంగా అర్జీలో రాసేవిధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అధికారుల బృందాలు ఏర్పాటు...
ప్రజాదర్బార్‌లో వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు పదిమంది జిల్లాస్థాయి అధికారులతో ప్రత్యేక బృందాలను కలెక్టర్ విజయకుమార్ ఏర్పాటు చేశారు. ఈ పది బృందాలు ప్రజాదర్బార్ జరిగే వేదికకు దగ్గరగా టేబుళ్లు వేసుకుని కూర్చుంటాయి. ఇకనుంచి అర్జీదారులు నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లకుండా ముందుగా ఆ అధికారుల బృందం వద్దకు వెళ్తారు. ఆ సమస్యను సంబంధిత శాఖ జిల్లా అధికారి పరిశీలిస్తారు. తమ పరిధిలో పరిష్కారమయ్యే విధంగా ఉంటే తమ కిందిస్థాయి అధికారికి అక్కడికక్కడే ఫోన్‌చేసి తగు ఆదేశాలు జారీచేస్తారు.
అంతటితో ఆగకుండా ఆ సమస్యను ఎప్పుటిలోగా పరిష్కరిస్తారో కూడా స్పష్టంగా తెలుసుకుంటారు. కొన్నిరకాల సమస్యలు కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేవి ఉంటాయి. అలాంటి వాటిని స్క్రూట్నీ చేసి కలెక్టర్ వద్దకు పంపిస్తారు. కలెక్టర్ తాజాగా తీసుకున్న నిర్ణయాలతో ప్రజాదర్బార్‌లో సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతాయని ఒక అధికారి ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో ప్రజాదర్బార్‌ను వినూత్నంగా నిర్వహించేందుకు కలెక్టర్ విజయకుమార్ చొరవ చూపడం విశేషం.
ప్రజాదర్బార్‌లో ‘హెల్ప్ డెస్క్’
Published Mon, Dec 30 2013 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement