జిల్లాలో మండుతున్నఎండలు కోళ్ల రైతులకుఊపిరాడకుండా చేస్తున్నాయి. ఫారాల్లోని కోళ్లు ఎండ ధాటికి పిట్టల్లా రాలిపోతున్నాయి. వ్యయప్రయాసల కోర్చి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. గత నెల 30వ తేదీన ఎండ 43 డిగ్రీలుగా నమోదైంది. ఆ రోజు ఎండతీవ్రతను తట్టుకోలేక జిల్లాలో మూడు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి.
కొడవలూరు: ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటంతో జిల్లాలో రోజుకు వెయ్యి నుంచి రెండువేల కోళ్లు దాకా చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత మరో నెల ఇదేవిధంగా కొనసాగుతూ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతుండటంతో కోళ్ల రైతులు అయోమయంలో పడ్డారు.
జిల్లాలో మూడు లక్షల కోళ్లు
జిల్లాలోని కొడవలూరు మండలం తలమంచి, కోవూరు మండలం పాటూరు, నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ, అల్లీపురంలో కోళ్ల ఫారాలున్నాయి. వీటన్నింటిలో సుమారు మూడు లక్షల కోళ్లు ఉన్నాయి. వీటిలో సింహభాగం తలమంచిలోనే 1.50 లక్షల కోళ్లున్నాయి. గుడ్లు ఉత్పత్తి లక్ష్యంగా వీటిని కోళ్ల ఫారాల్లో పెంచుతున్నారు. రోజుకు సగటున రెండు లక్షల గుడ్లు దాకా జిల్లాలోని కోళ్ల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు 10 లక్షల గుడ్లు దాకా జిల్లాలో వినియోగం ఉన్నా, మిగిలిన గుడ్లను హైదరాబాద్, విజయవాడ, తమిళనాడులోని నమ్మకల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
ముందు జాగ్రత్తలు
♦ ఎండ తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడకుండా వ్యయ ప్రయాసలకోర్చి రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్ల ఫారం చుట్టూ గోతపు పట్టలు కప్పి నిత్యం వాటిని నీటితో తడుపుతున్నారు.
♦ పైకప్పు రేకులపై స్పింక్లర్లు ఏర్పాటు చేసి ఎండ సెగను తగ్గించేందుకు యత్నిస్తున్నారు.
♦ కోళ్ల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన చానల్స్‌లో నీళ్లు నిల్వ ఉండకుండా నిత్యం సరఫరా అయ్యేలా చూస్తున్నారు.
♦ ఎండకు కోళ్లు మేత తక్కువగా తింటుండడంతో గుడ్ల పరిమాణం తగ్గుతోంది. దీనిని పెంచేందుకు హైప్రొటీన్, హై ఎనర్జీ, ఎక్స్‌ట్రా కాల్షియం, గ్లూకోజ్‌లు అదనంగా ఇస్తున్నారు.
♦ కోళ్ల ఫారాలు లోపల వేడిని తగ్గించేందుకు నీటిని మంచు వలె చల్లే ఫాగర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫారాల్లో ప్రత్యేక ఫ్యాన్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
తీవ్ర నష్టమే
ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నష్టాన్ని నివారించలేకపోతున్నారు. రోజుకు సగటున జిల్లాలో వెయ్యి కోళ్లు దాకా మృతి చెందుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఎండ తీవ్రమవ్వడంతో తలమంచిలోనే వెయ్యి కోళ్లు మృతి చెందాయి. మిగిలిన అన్ని చోట్ల కలిపి రెండు వేల దాకా మృతి చెందాయి. పాటూరులో 30 వేల కోళ్లకు గానూ ఆ ఒక్క రోజే 500 మృతి చెందాయి.
తగ్గిన గుడ్ల ఉత్పత్తి
♦ రోజుకు రెండు లక్షల గుడ్ల ఉత్పత్తి రావాల్సి ఉండగా, కేవలం 1.50 లక్షల గుడ్ల ఉత్పత్తే వస్తోంది.
♦ చిన్న పరిమాణం గుడ్లు 50 శాతం ఉంటున్నాయి. పరిమాణం పెద్దగా ఉంటే రూ.3.50 పైసల వంతున విక్రయిస్తున్నారు. చిన్నవిగా ఉంటే మాత్రం రూ.2.50 పైసల వంతునే విక్రయించాల్సి వస్తోంది.
♦ వేసవి పరిస్థితుల దృష్ట్యా గుడ్డు ధర పెంచాలంటే ధర నిర్ణయం రైతుల చేతుల్లో లేదు. దేశ వ్యాప్త మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ముంబయిలో ధర నిర్ణయం జరుగుతోంది. దీనికితోడు వేసవిలో జిల్లాలోనూ గుడ్ల వినియోగం తగ్గుతోంది. సాధారణం కంటే 10 నుంచి 15 శాతం వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ధర పెంచడం కుదరదని ధర నిర్ణేతలే ప్రకటిస్తున్నారు.
పెరిగిన బ్రాయిలర్ కోళ్ల మృతుల శాతం
ఫారాల్లో మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లకూ వేసవి షాక్ తగులుతోంది. వీటి మృతుల సంఖ్య వేసవిలో గణనీయంగా పెరుగుతోంది. సాధారణ పరిస్ధితుల్లో వీటి మరణాలు 4 నుంచి 5 శాతం ఉంటే వేసవిలో 10 నుంచి 15 శాతం ఉంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో నెలకు ఆరు లక్షల కోళ్లు అవసరం ఉంది. ఒక్క కోడి నుంచి సగటున రెండు కిలోల మాంసం వస్తుంది. ఈ లెక్కన జిల్లాలో నెలకు ఆరు లక్షల కిలోల బ్రాయిలర్ మాంసం అవసరం ఉంది. వేసవిలో వీటి మరణాలు అధికంగా ఉండటంతో వేసవి కాలంలో జిల్లాలో వీటి పెంపకాన్ని పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన బ్రాయిలర్ కోళ్లను చిత్తూరు జిల్లా పలమనేరు, తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని కోలార్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు అవసరమైన కోళ్లన్నీ ఇతర ప్రాంతాల నుంచి వస్తుండడంతో రవాణాలోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మే, జూన్ మాసాల్లోనైతే 15 శాతానికి తగ్గకుండా మరణాలుంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర వేసవిలో ఆకాశాన్నంటుతోంది. గురువారం కిలో బ్రాయిలర్ మాంసం చర్మంతో కలిపి రూ.176 ఉండగా, చర్మం లేకుండా(స్కిన్‌లెస్) రూ.208గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment