సాక్షి, హైదరాబాద్/అమరావతి: అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని పీస్ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు. తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని సూచించారు. అనుమానితులు, నేరచరిత గల వారిపై నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో పికెటింగ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన, అనుమానిత ప్రాంతాలకు వాటర్ కెనన్లు, వజ్ర వాహనాలను తరలించనున్నారు. మరీ ముఖ్యంగా నిజామబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.
సోషల్ మీడియాపై నిఘా
ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా కామెంట్లు, పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు.
ఏపీ అంతటా అప్రమత్తం
అయోధ్య కేసులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. డీజీపీ గౌతం సవాంగ్ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
అయోధ్య : ఏపీ, తెలంగాణలో హై అలర్ట్!
Published Sat, Nov 9 2019 3:31 AM | Last Updated on Sat, Nov 9 2019 3:34 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment