సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి పాలనకు ఉద్దేశించిన 356వ అధికరణను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, ఆ అధికరణను దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఉపయోగిస్తోందని, అందువల్ల దానిని రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. ఈ వ్యాజ్యానికి సంబంధించిన వాదనలను రాతపూర్వకంగా సమర్పించాలన్న ధర్మాసనం ఆదేశాల మేరకు పిటిషనర్ జె.పి.రావు తన వాదనలను రాతపూర్వకంగా సోమవారం కోర్టుకు సమర్పించారు. వీటిని స్వీకరించిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే అసెంబ్లీ తీర్మానం లేకుండా కేంద్రం విభజనపై నిర్ణయం తీసుకుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది సి.మహేష్ చంద్రకుమార్‌రెడ్డి దాఖలు చేసిన మరో వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.