'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు అనుమతి
హైదరాబాద్ : ఏపీ ఎన్జీవోల 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ స్టేడియమ్‌లో రేపు జరిగే సమావేశానికి ఉద్యోగులు మాత్రమే హాజరుకావాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డులు ఉన్న వారినే సభకు అనుమతించాలని పోలీసుల్ని న్యాయస్థానం ఆదేశించింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సూచించింది. మరో వైపు ' సేవ్ ఆంధ్రప్రదేశ్' సభ ప్రత్యక్ష ప్రసారం చేయకుండా చూడాలన్న తెలంగాణ న్యాయవాదుల విజ్ఞప్తిపై అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.
మరోవైపు ఎల్బీ స్టేడియంలోని ఏర్పాట్లను ఏపీఎన్జీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ సభకు ఎంతమంది వస్తారన్న దానిపై అంచనా లేదన్నారు. అయితే ఎవరూ గుంపులు, గుంపులుగా రావద్దని ఆయన సూచించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సజావుగా జరిగేందుకు తెలంగాణ వాదులు సహకరించాలని అశోక్ బాబు కోరారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని అశోక్ అన్నారు.