చంద్రబాబు ప్రభుత్వ మెమోపై హైకోర్టు తీర్పు నేడు
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలున్న ప్రజాప్రతినిధులకు రక్షణగా ఉన్న 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన మెమోకు సవరణలు చేసేందుకు తగిన ఆదేశాలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అవినీతి ఆరోపణలొస్తే నేతలపై ప్రాథమిక విచారణ జరిపి ఏసీబీ అధికారులు ఇచ్చే నివేదికను ప్రత్యేక సలహా కమిటీకి నివేదించాలని ప్రభుత్వం ఆ మెమోలో పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి నిబంధన చట్ట ప్రకారం ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది.
ఏసీబీ అధికారులు ప్రభుత్వం చెప్పిన ప్రకారం కాకుండా కోర్టుల ఆదేశాలను పాటించడం సబబుగా ఉంటుందని వ్యాఖ్యానించింది. ఆ మెమో విషయంలో బుధవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై కేసు నమోదు చేయకుండా ఏసీబీ అధికారులను నియంత్రిస్తూ 1999లో జారీ చేసిన మెమో వల్ల మద్యం సిండికేట్ల వ్యవహారంలో సరైన రీతిలో దర్యాప్తు చేయలేకపోతున్నారంటూ హైదరాబాద్‌కు చెందిన ఓఎం దేబరా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం... మంగళవారం దాన్ని మరోసారి విచారించింది. ప్రభుత్వ న్యాయవాది కె.శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రజాప్రతినిధులపై కేసుల నమోదుకు ఆదేశాలిస్తే దానివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోపణ చేస్తూ ఉంటారని నివేదించారు. ఇందుకు సంబంధించి ఒక కేసులో సుప్రీంకోర్టు కొన్ని మినహాయింపులతో ఉత్తర్వులు ఇచ్చిందని చెప్పారు. ఆ తీర్పును పరిశీలించిన ధర్మాసనం... ప్రజా ప్రతినిధులకు అవినీతి నిరోధక చట్టం కింద ఎటువంటి రక్షణలూ లేవంది. ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించిన తరువాత సలహా కమిటీతో పనేముంటుందని ప్రశ్నించింది.
కోర్టులు విచారణకు స్వీకరించదగిన నేరాన్ని ప్రజాప్రతినిధులు చేసి ఉంటే ఏసీబీ అధికారులు చట్ట ప్రకారం ముందుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు జోక్యం చేసుకుంటూ... అవినీతి ఆరోపణలు ఉన్నవారిపై కేసులు నమోదు చేయకుండా, కేవలం వారికి నోటీసులు ఇచ్చి వివరణలు మాత్రమే ఏసీబీ అధికారులు తీసుకుంటున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా చేయాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. ఇరువైపు వాదనలను విన్న ధర్మాసనం... ఈ మొత్తం వ్యవహారంలో బుధవారం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.