హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు
ప్రజాప్రతినిధులను రక్షించేలా 1999లో బాబు మెమో జారీ
అవినీతి ఆరోపణపై నివేదికను సలహా మండలికి ఇవ్వాలని ఆదేశం
సలహామండలి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమన్న హైకోర్టు
ఎవ్వరికీ లేని రక్షణ ప్రజా ప్రతినిధులకెందుకని నిలదీత
మద్యం సిండికేట్ల వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశం
3 నెలల్లో నివేదిక అందించాలని, అధికారులను మార్చొద్దని ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులను రక్షించేందుకు వీలుగా 1999లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన మెమోను హైకోర్టు బుధవారం పాక్షికంగా రద్దు చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులపై ప్రాథమిక విచారణ అనంతరం ఏసీబీ సమర్పించే నివేదికను సలహా మండలికి నివేదించాలని ప్రభుత్వం ఆ మెమోలో పేర్కొనడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సలహా మండలి ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెబుతూ, దానిని రద్దు చేసింది. ప్రభుత్వం అలా చేసి ఉండాల్సింది కాదంటూ ఆక్షేపించింది. అంతేకాక మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఈ మెమో వల్ల దర్యాప్తు నుంచి రక్షణ పొందిన ప్రజా ప్రతినిధులందరిపై మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి, అందుకు సంబంధించిన నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలిలా ఉన్నాయి...
మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు వారిపై కేసు నమోదు చేయకుండా అవినీతి నిరోధక శాఖ అధికారులను నియంత్రిస్తూ అప్పటి ప్రభుత్వం 1999లో ఓ మెమో జారీ చేసిందని, దీనివల్ల మద్యం సిండికేట్ల వ్యవహారంలో ఏసీబీ అధికారాలు సరైన రీతిలో దర్యాప్తు చేయలేకపోతున్నారంటూ నగరానికి చెందిన ఓ.ఎం.దేబరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం దాన్ని మరోసారి విచారించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేయకుండా, ఏసీబీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చి వివరణలను తీసుకుంటున్నారని, ఇది చట్ట విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది గండ్ర మోహనరావు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అనంతరం ప్రభుత్వ మెమోలోని సలహా మండలి ఏర్పాటు అంశాన్ని రద్దు చేస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయమూర్తులతో సహా ఎవ్వరికీ లేని రక్షణ ప్రజా ప్రతినిధులకు మాత్రం ఎందుకని ప్రభుత్వాన్ని తన ఉత్తర్వుల్లో నిలదీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి నోటీసులు జారీ చేసి, వారి వివరణలు తీసుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. వివరణలు తీసుకునే విధానానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకుని మద్యం సిండికేట్ల వ్యవహారానికి సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, దర్యాప్తు నివేదికను తమ ముందుంచాలని ఏసీబీ అధికారులకు స్పష్టం చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోని అధికారులెవ్వరినీ కూడా తమ అనుమతి లేకుండా మార్చరాదని ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించింది. అంతేకాక అధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతినివ్వాలంటూ ఏసీబీ అధికారులు చేసిన విజ్ఞప్తిపై మూడు నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది.
‘బాబు మెమో’ పాక్షిక రద్దు
Published Thu, Feb 27 2014 2:38 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement