వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన విగ్రహాలు
విశాఖసిటీ: ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బీచ్ రోడ్డులో రాత్రికి రాత్రి విగ్రహాలు ఏర్పాటు చేయడం.. ఆపై వాటిని ఆవిష్కరించడంపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయగా హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతేడాది నవంబర్ 30వ తేదీన రాత్రికి రాత్రే దాసరి నారాయణరావు, నందమూరి హరికృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాల్ని ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే విగ్రహాలు ఏర్పాటు చెయ్యడంపై జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బాధ్యులకు వెంటనే నోటీసులు జారీ చెయ్యాలని జోన్–2 అధికారులను ఆదేశించారు. దీంతో డిసెంబర్ 1వ తేదీన జోన్–2 కమిషనర్ నల్లనయ్య విగ్రహాలు ఏర్పాటు చేసి వారికి నోటీసులు జారీ చేశారు. రెండు నెలలు గడుస్తున్నా వాటిని తొలగించలేదు. అయితే దీనిపై బొలిశెట్టి సత్యనారాయణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) వేశారు.
పూర్తి స్థాయి విచారణ తర్వాత పిల్ నం.19/2019ను హైకోర్టు శుక్రవారం స్వీకరించింది. పిల్‌ను పూర్తిగా పరిశీలించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీతో పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జోన్–2 కమిషనర్ నల్లనయ్య, అక్కినేని కళాసాగర్ అధ్యక్షుడు పొన్నాడ మోహనరావుకి నోటీసులు జారీ చేసింది. వీరిని ప్రతివాదులుగా చేర్చుతూ వాదనలు వినిపించేందుకు రెండు వారాల గడువు విధించింది. వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది.దీనిపై పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసేందుకు 2017 ఆగస్ట్‌లో యునైటెడ్ దళిత్ ఫ్రంట్ దరఖాస్తు చేసుకుంటే.. ఇంత వరకూ పట్టించుకోకపోవడం గర్హనీయమన్నారు. కానీ ఇలా రాత్రికి రాత్రే మూడు విగ్రహాలు పెట్టినా కలెక్టర్, కమిషనర్ ఏమీ చెయ్యకుండా విడిచిపెట్టడాన్ని సహించలేకే పిల్ వేశానని తెలిపారు. విగ్రహాలు ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదనీ, నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఏర్పాటు చెయ్యడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment