
సాక్షి, విశాఖపట్నం : నగరంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు కుండపోత వర్షం కురవడంతో బీచ్ రోడ్డులో మోకాలు లోతు వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖలో దాదాపు 8 సెం.మీ మేర వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. అయితే నగరంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి జల్లులు పడ్డాయి. మరోవైపు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో భారీ వర్షం కురిసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.