సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు పనులను ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమా తదితర కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నౌషాద్ అలీ బుధవారం తీర్పు వెలువరించారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా ప్రజాధనం వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు తీర్పులో పేర్కొన్నారు. మొదట అనర్హత జాబితాలో చేర్చిన కంపెనీలను తిరిగి అర్హత జాబితాలో చేర్చుతూ రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయంటపై సోమా జాయింట్ వెంచర్ హైకోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్‌స్ట్రాయ్ జాయింట్ వెంచర్‌కు మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ మధుకాన్ జాయింట్ వెంచర్ మరో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే టెండర్ నిబంధనలను సడలించడాన్ని సవాలు చేస్తూ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మహాలక్ష్మి ఇన్‌ఫ్రా వేర్వేరుగా 2 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ అలీ వాటిని కొట్టివేస్తూ బుధవారం తీర్పు వెలువరించారు.
‘‘పోలవరం ప్రాజెక్టు దశాబ్దాలుగా ప్రజల చిరకాల వాంఛ. సముద్రంలో వృథాగా కలుస్తున్న నీటిని మళ్లించి లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలన్న ఉద్దేశంతో, కోట్ల మందికి ఆనందంతో పాటు సుసంపన్నత కలిగించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మాణం తొలుతలోనే ప్రారంభించి ఉంటే ప్రస్తుత అంచనా వ్యయంలో 4వ వంతు ఖర్చుతోనే సాకారమయ్యేది. ప్రస్తుతం కాంట్రాక్టు కేటాయింపులను ఆమోదించడం వల్ల ఇప్పటికైనా రూ. 600 కోట్ల మేర ప్రజాధనం ఆదా అవుతుంది. ఇదేమీ తక్కువ కాదు. ప్రజల తప్పేమీ లేకపోయినా పోలవరం ప్రాజెక్టు సుదీర్ఘ కాలంగా నిలిచిపోయింది. వాస్తవానికి అంతకాలం వేచిచూడాల్సిన అవసరం లేదు.’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.
‘పోలవరం’పై పిటిషన్ల కొట్టివేత
Published Thu, Sep 12 2013 2:36 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement