సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను పక్కదారి పట్టించే క్రమంలో డీజీపీ ఠాకూర్ అల్లిన కట్టుకథలను నిజం చేసేందుకు విశాఖ పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం సీపీ, ఏసీపీ ఒకరికొకరు పొంతనలేని మాటలు మాట్లాడడంతో పోలీసుల నిజాయితీపై సందేహాలు ముసురుకుంటున్నాయి. విశాఖ విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో గురువారం మధ్యాహ్నం దుండగుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్‌పై కత్తితో హత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై రాష్ట్ర పోలీసులు కనీస ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అమరావతిలో డీజీపీ ప్రకటన చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
‘హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు వైఎస్ జగన్ అభిమానే.. కేవలం సంచలనం సృష్టించేందుకే దాడికి దిగారు’.. అని ఆయన ప్రకటించడంపై ప్రజలు, రాజకీయ పక్షాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి డీజీపీ ఆ ప్రకటన చేసే సమయానికి శ్రీనివాసరావును ఏపీ పోలీసులు తమ అదుపులోకి కూడా తీసుకోలేదు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని ఎయిర్‌పోర్టులోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో నిందితుడ్ని ఎయిర్‌పోర్ట్ స్టేషన్ పోలీసులకు అప్పజెప్పారు. ఈలోగానే డీజీపీ చేసిన ప్రకటనను అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబునాయుడు మొదలు రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు హత్యాయత్నం ఘటనపై ఇష్టారాజ్యంగా మాట్లాడారు. అభిమానే దాడి చేశాడంటూ చులకనగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో కనీస వాస్తవాలు తెలియకుండా, ఘటనపై ప్రాథమిక విచారణ కూడా జరపకుండా డీజీపీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విశాఖ నగర పోలీసులకు సంకట స్థితిని తెచ్చాయి. ఆయన మాటలను నిజం చేసేందుకు వారు గురువారం సాయంత్రం నుంచి తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు.
పొంతనలేని పోలీసుల మాటలు
కాగా, నిందితుడు శ్రీనివాసరావు 9 ఫోన్ సిమ్‌లు వాడాడని ఏసీపీ అర్జున్ గురువారం వెల్లడించారు. రెండు రోజుల కిందటే ఓ సిమ్ తీసుకున్నాడని కూడా ఆయన తెలిపారు. అయితే, శుక్రవారం నగర సీపీ లడ్హా అందుకు విరుద్ధంగా మాట్లాడారు. నిందితుడు ఈ మధ్యకాలంలోనే 9 ఫోన్లు వాడాడని, సిమ్‌లు కాదని చెప్పారు. అలాగే, శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడని గురువారం చెప్పిన పోలీసులు శుక్రవారం కుక్‌గా చేస్తున్నాడని వెల్లడించారు. ఇలా పొంతన లేని మాటలు, దాటవేత సమాధానాలతో రాష్ట్ర పోలీసుల విచారణ సందేహాల మధ్య సాగింది.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు..
ఇదిలా ఉంటే.. గురువారం సాయంత్రం శ్రీనివాసరావును సీఐఎస్‌ఎఫ్ నుంచి తమ అదుపులోకి తీసుకున్న ఎయిర్‌పోర్టు పోలీసులు రాత్రంతా ఏసీపీ లంకా అర్జున్ కార్యాలయంలో ఉంచారు. ఆ తర్వాత శుక్రవారం ఉదయం నిందితుడ్ని విచారించే విషయమై నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా, డీసీపీ ఫకీరప్ప హైడ్రామాకు తెరలేపారు. అందులో భాగంగా..
- శుక్రవారం ఉ.9 గంటల సమయంలో శ్రీనివాసరావును ఎయిర్‌పోర్ట్ స్టేషన్‌కు తరలించారు.
- సా.4.30 గంటల వరకు నానా హడావుడి చేశారు.
- అప్పటికప్పుడు పోలీస్‌స్టేషన్‌కు సీసీ కెమెరాలు బిగించి విచారణ నేరుగా డీజీపీ వీక్షించేలా వెబ్ కాన్ఫరెన్స్‌ను ఏర్పాటుచేశారు.
- విచారణలో సంచలన విషయాలు బయటికొస్తాయని మీడియాకు లీకులిచ్చారు. – కానీ, సా.4.30గంటల సమయంలో లడ్హా అదే స్టేషన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబట్టలేకపోయామని చెప్పారు.
అదుపులోకి తీసుకుని 24గంటలైంది.. ఏకబిగిన ఇన్ని గంటలు విచారించారు.. కనీసం అతని నుంచి వివరాలేమీ సాధించలేకపోయారా.. తెర వెనుక ఎవరున్నారు.. అతను ఎవరి ప్రోద్బలంతో చేశాడు.. అని మీడియా ప్రశ్నిస్తే.. ‘అతను నోరు విప్పడంలేదు.. నిన్న చెప్పిన విషయాలే చెప్పుకొస్తున్నాడు.. మరింత సమాచారం రాబట్టడం కోసం పోలీస్ కస్టడీలోకి తీసుకుంటామ’ని సీపీ తాపీగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment