
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన డీజీపీ ఆర్పీ ఠాకూర్ తప్పుదిద్దుకునే చర్యల్లో పడ్డారు. విజయవాడలో ఓ సమావేశానికి హాజరైన ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.. వైఎస్ జగన్ భద్రత గురించి, నిందితుడు శ్రీనివాసరావు కస్టడి గురించి మీడియా ఆడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. భద్రత కల్పించడమనేది డీజీపీగా తన బాధ్యతని గుర్తుచేశారు. ఈ ఘటన నేపథ్యంలో వైఎస్ జగన్‌కు భద్రత పెంచుతామని వివరించారు.
నిందితుడు శ్రీనివాసరావు విషయంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ నుంచి ఎటువంటి నోటీసులు తమకు రాలేదని తెలిపారు.. శ్రీనివాస్ పోలీసు కస్టడీ నేటితో ముగిసిందని, మరికొన్ని రోజులు గడువు కావాలనుకుంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టును ఆడుగుతారని వివరించారు. అయితే ఈ కేసును తాను ఇన్వెస్టిగేషన్ చేయటం లేదని స్పష్టం చేశారు. విచారణలో భాగంగా వైఎస్ జగన్‌ను రెండుసార్లు వివరణ ఇవ్వమని అడిగామని.. మరోసారి అడుగుతామని పేర్కొన్నారు.